🕑 Published: July 17, 2026 at 10:29 AM CST
* సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో శతచండీ సహిత రుద్రయాగం
మిస్సోరిలోని ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం కార్యక్రమంలో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. వేదమంత్రాల మధ్య భక్తిశ్రద్ధలతో కొనసాగింది. యాగశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివశక్తుల అనుగ్రహాన్ని పొందారు. అమెరికాలో ఇంత వైభవంగా జరుగుతున్న ఈ మహాయాగం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
మూడో రోజు కార్యక్రమాలు గోమాత పూజతో ప్రారంభమయ్యాయి. అనంతరం ఋత్వికులు శాస్త్రోక్తంగా మహాన్యాస పారాయణం నిర్వహించారు. వేదఘోషల మధ్య జరిగిన ఈ పారాయణం అనంతరం పరమశివుని అనుగ్రహం, లోకక్షేమం, సర్వజన సుఖశాంతి కోసం రుద్రహోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో హోమంలో పాల్గొని ప్రత్యేక పూర్ణాహుతులను సమర్పించారు. ఉదయం అరుణ హోమం నిర్వహించారు. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, జీవనంలో సానుకూల శక్తి ప్రసాదం కోసం ఈ హోమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం చండీ హోమం నిర్వహించారు. జగన్మాత చండికాదేవి అనుగ్రహం, ధర్మరక్షణ, శత్రుబాధల నివారణ, సర్వమంగళ సిద్ధి కోసం నిర్వహించిన ఈ హోమంలో మహిళలు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దేవీ మంత్రోచ్చారణలతో యాగశాల మారుమ్రోగింది.
అనంతరం నిర్వహించిన రాజశ్యామల హోమం మూడో రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్య, జ్ఞానం, వాక్పటిమ, కళలు, నాయకత్వ లక్షణాలు, ఐశ్వర్యం ప్రసాదించే శ్రీ రాజశ్యామలాదేవికి అంకితమైన ఈ హోమాన్ని ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు, ఉద్యోగవేత్తలు, వ్యాపారవేత్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ హోమంలో పాల్గొని ప్రత్యేక సంకల్పాలు చేశారు. రోజంతా నిర్వహించిన కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవకులు భక్తులకు తీర్థ ప్రసాదం, అన్నప్రసాదం అందించారు. జూలై 19వ తేదీ వరకు కొనసాగనున్న ఈ నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగంలో ప్రతిరోజూ విశిష్ట పూజలు, హోమాలు, చండీ పారాయణం, రుద్రయాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొనవల్సిందిగా కమిటీ ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి పుట్టగుంట మురళీ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్, మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనేనిలు తెలిపారు.







