🕑 Published: July 17, 2026 at 03:45 PM CST
2001లో స్థాపించిన సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవ వేడుకలను ఆగష్టు 1వ తేదీన కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ ఎరీనాలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మూడు గిన్నీస్ రికార్డులు నెలకొల్పేందుకు ప్రయత్నించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, అధ్యక్షురాలు తనుగుల ప్రియలు తెలిపారు. గిన్నీస్ సంస్థ అధికారిక గుర్తించిన ఈ ప్రయత్నాన్ని సమీక్షించి ధృవీకరించేందుకు గిన్నీస్ ప్రతినిధి మైకేల్ ఎంప్రిక్ జడ్జిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ప్రపంచం నలుమూలల నుండి 15వేల మంది అతిథులు ఈ వేడుకల్లో సందడి చేస్తారని ఆనంద్ వెల్లడించారు.
ఈ రజతోత్సవంలో దేశ విదేశాలకు చెందిన 5000 మందికి పైగా సంగీత, నృత్య, నాటక, జానపద కళాకారుల ప్రదర్శనలతో ప్రపంచ రికార్డులు నెలకొల్పే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. "సంగీతామృతవర్షిణి" కార్యక్రమంలో 1000మంది శాస్త్రీయ గాయనీ గాయకులు పాల్గొని మన వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించడం ద్వారా, "లయామృతవర్షిణి"లో 300మంది మృదంగ విద్వాంసుల లయవిన్యాసం ద్వారా, వేమన-సుమతి శతకాల నుండి ఎంపిక చేసిన 18పద్యాలను 1800మంది ఆలపించి "శతకశంఖారావం" పూరించడం ద్వారా అమెరికాలో తొలిసారిగా తెలుగు సాంస్కృతిక ప్రదర్శనలతో మూడు గిన్నీస్ రికార్డులను నెలకొల్పేందుకు భారీస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు.
వీటితో పాటు "కూచిపూడి నాట్యామృతవర్షిణి"లో రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొదటగా "పద్మభూషణ్" డాక్టర్ వెంపటి చినసత్యంకు నివాళిగా ఆయన నృత్యకల్పన చేసిన "బ్రహ్మాంజలి" నృత్యరూపకాన్ని 5000మంది ప్రదర్శించనున్నారు. రెండోది సిలికానాంధ్ర 25 సంవత్సరాల ఉజ్జ్వల ప్రస్థానంలోని ప్రధాన ఘట్టాలతో కూడిన "సిలికానాంధ్ర వైజయంతి" నృత్యరూపకం కనువిందు చేయనుంది. తెలుగు శ్రోతల మనసు దోచిన పలు లలిత గీతాలను 300మంది గాయనీగాయకులు "లలితగీతామృతవర్షిణి"లో ఆలపిస్తారు. తెలుగుజాతి తరతరాలుగా ప్రదర్శిస్తున్న జానపద కళారూపాలను 1000మంది కళాకారులు "జానపద జాతర"లో ప్రదర్శిస్తారు. వివిధ చారిత్రక సందర్భాల్లో భారతదేశం సాధించిన వీరోచిత విజయాలు ప్రతిబింబించే "వందేభారతం" సంగీత నృత్యరూపకం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో "దక్షయజ్ఞం" పౌరాణిక నాటక ప్రదర్శన ఈ వేడుకల్లో అలరించనుంది.
Register Here - https://silverjubilee.siliconandhra.org





