🕑 Published: August 28, 2026 at 05:49 PM CST
ప్రవాసాంధ్రులకు వారి స్వస్థలాల్లో ఎదురయ్యే సాధారణ సమస్యలకు పరిష్కారం చూపడం, స్వదేశంలో వారి అవసరాలకు అండగా నిలబడటమే లక్ష్యంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీను మరింత వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఆ విభాగం అధ్యక్షుడు, టెక్సాస్‌లో ప్రముఖ వైద్యుడు, కర్నూలు జిల్లా ప్రవాసాంధ్రుడు డా. పిల్లారిశెట్టి గురురాజా తెలిపారు. ఇటీవల ఆ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన TNILIVEతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం...
డా. గురురాజా పూర్వీకులది చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కనకంపాలెం. ఆయన తండ్రి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేసేవారు. ఆదోనీలో జన్మించిన గురురాజా తన తండ్రి ఉద్యోగరీత్యా తన మూడో ఏట కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చేరుకున్నారు. అక్కడే ప్రాథమిక, ఉన్నత, ఇంటర్ విద్యను అభ్యసించారు. కర్నూలు మెడికల్ కాలేజీ 1977వ బ్యాచ్‌కు చెందిన ఆయన 1983లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అదే కళాశాలలో 1983-87 మధ్య ఈఎన్‌టీలో ప్రత్యేక శిక్షణ పొందారు. విద్యార్థి దశలోనే ఆయన 1986లో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జుడా) అధ్యక్షుడిగా పనిచేశారు. వైద్య విద్య, జూనియర్ వైద్యుల సమస్యల పరిష్కారం, నాయకత్వ అనుభవం వంటి అంశాలు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
కోయిలకుంట్ల ప్రాంతంలో డా. గురురాజా కోట్ల రూపాయిల విలువైన పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. "గురురాజా మిత్రమండలి" ద్వారా 12సంవత్సరాల పాటు విద్యార్థులకు ఉపకారవేతనాలు, వైద్య సాయం, పేదలకు ఆర్థిక చేయూత, కులవృత్తులపై ఆధారపడే కుటుంబాలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నాలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి పలువురికి కుట్టు మిషన్లు అందించారు. ప్రతి సంవత్సరం రూ.50 లక్షల వరకు వివిధ సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. కోయిలకుంట్లలో అనేక కుటుంబాలు ఈ సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాయని వివరించారు.
1991లో అమెరికాకు వెళ్లిన గురురాజా న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ మెడికల్ సెంటరులో గైనకాలజీలో రెసిడెన్సీ పూర్తి చేశారు. అనంతరం టెక్సాస్‌లోని ఒడెస్సాకు వెళ్లి అక్కడ సొంత ప్రాక్టీసును ప్రారంభించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన సతీమణి డా. ఉషారాణి గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థిని. ఆమె కూడా ఇదే క్లినిక్‌లో ఇంటర్నల్ మెడిసిన్ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు కార్తీక్ జార్జి మేసన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయవాద పట్టా అందుకుని ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో అమెరికా ఫెడరల్ గవర్నమెంటుకు పనిచేస్తుండగా కుమార్తె కీర్తి యూటీ డల్లాస్‌లో పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ చదువుతున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన కార్తీక్ వివాహానికి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ సతీసమేతంగా హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు గురురాజా తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ కర్నూలు పర్యటనలను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర సందర్భంగా కర్నూలులో ఆయనతో కలిసి ప్రయాణించిన రోజుల నుంచే పార్టీతో తన అనుబంధం మరింత బలపడిందని చెప్పారు. 1983 ఎన్నికల సమయంలో డోన్ నియోజకవర్గంలో కె.ఈ.కృష్ణమూర్తి ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో పనిచేశామని, ఆ తర్వాత కూడా ఆయన కుటుంబంతో కలిసి రాజకీయంగా ప్రయాణించినట్లు వివరించారు. కె.ఈ. కృష్ణమూర్తి మార్గదర్శకత్వంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన గురురాజా, 1991లో అమెరికాకు వెళ్లిన తర్వాత కూడా తన రాజకీయ అనుబంధాన్ని కొనసాగించారు. ప్రవాసంలో ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ మిత్రులకు, ఎన్నికల సమయంలో అవసరమైన వారికి తన వంతు ఆర్థిక సాయాన్ని అందించారు. స్వగ్రామంతో సంబంధాలను కొనసాగించారు. తన రాజకీయ ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టంగా 2005 ఎన్నికల సమయంలో కర్నూలులో పర్యటన సందర్భంగా చంద్రబాబుతో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుండి నేటివరకు ఆయనతో కలిసి ప్రయాణించే అవకాశం రావడం తన రాజకీయ జీవితంలో గుర్తుండిపోయే అనుభవమని తెలిపారు. 2013లో నారా లోకేష్తో పరిచయం అనంతరం ఎన్నారై తెదేపా కార్యకలాపాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
ప్రవాసాంధ్రులలో తెలుగుదేశం పార్టీని మరింత విస్తృతంగా బలోపేతం చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ అభిమానులు, మద్దతుదారులు, ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారిని ఒకే వేదికపైకి తీసుకురావడం ధ్యేయంగా గ్లోబల్ ఎన్నారై తెదేపాను తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించామని డా. గురురాజా అన్నారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస టీడీపీ కార్యకలాపాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం తన ముందున్న ప్రధాన లక్ష్యాలని గురురాజా వివరించారు.
ప్రస్తుతం ఎన్ఆర్ఐ టీడీపీ పేరిట వివిధ దేశాల్లో విడివిడిగా కార్యకలాపాలు సాగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో పార్టీతో ప్రత్యక్ష సంస్థాగత సంబంధం లేకుండా నడిచే గ్రూపులు కూడా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితికి పరిష్కారంగా ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా సమన్వయం కోసం తొలిసారిగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని తెదేపా సంస్థలను, కార్యకర్తలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నదే ఈ వ్యవస్థ వెనుక ఉన్న ఆలోచనగా పేర్కొన్నారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కేంద్ర కమిటీలో సుమారు 45 మంది సభ్యులు ఉంటారు. వీరంతా దేశాల వారీగా కాకుండా ప్రాంతాలు/విభాగాలు వారీగా బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు. న్యూజిలాండ్–ఆస్ట్రేలియా ఒక విభాగంగా, గల్ఫ్ మరో విభాగంగా, యూరప్, అమెరికా వంటి ప్రాంతాలు వేర్వేరు విభాగాలుగా పరిగణించే విధంగా ప్రాంతీయ సమన్వయ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కేంద్ర కమిటీకి సంబంధించిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షంగా నిర్వహించాలని ప్రణాళికలు తయారు చేస్తున్నామని గురురాజా తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకలాపాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నది తమ ఆలోచనగా తెలిపారు.
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి ఇప్పటికే పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనని ప్రవాసాంధ్రులను క్రియాశీలకంగా మార్చడమేనని గురురాజా పేర్కొన్నారు. ప్రస్తుతం కొంతమంది మాత్రమే నిరంతరం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, మెజార్టీ ప్రవాస కార్యకర్తలు పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ "సైలెంట్ సపోర్టర్స్"గా మిగిలిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వర్గాన్ని గుర్తించి వారికి పార్టీ కార్యకలాపాల్లో తగిన పాత్ర కల్పించడం, సభ్యత్వాన్ని విస్తరించడం, కొత్త తరాన్ని కూడా పార్టీ కార్యకలాపాలకు అనుసంధానం చేయడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. శ్రేయోభిలాషులను కార్యకర్తలుగా మార్చాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రస్తుతం అధికారికంగా 30వేలుగా ఉన్నా ఎన్నారై తెదేపా సభ్యుల సంఖ్యను లక్ష మంది సభ్యుల స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గురురాజా తెలిపారు.
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని అన్ని వర్గాల తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండే వేదికగా తీర్చిదిద్దాలన్నది తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని గురురాజా చెప్పారు. పార్టీ పట్ల అభిమానంతో ఉన్నవారు ఎవరైనా పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములు కావొచ్చునని ఆయన సూచించారు. కేవలం ఎన్నికల సమయంలో కార్యక్రమాలు నిర్వహించే ఎన్ఆర్ఐ సంస్థగా కాకుండా, ప్రవాసాంధ్రులకు ఉపయోగపడే ఒక సంస్థాగత సహాయక వ్యవస్థగా ఎన్ఆర్ఐ టీడీపీని తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ఉన్నామని ఆయన వివరించారు. ఎన్ఆర్ఐలు పార్టీకి ఏమిస్తారు? అనే ప్రశ్న నుండి పార్టీ ఎన్నారైలకు ఎలా సాయపడుతుంది? అనే సమాధానం వైపు తాము పయనిస్తున్నామని పేర్కొన్నారు.
భారత్‌కు వచ్చినప్పుడు ఎన్ఆర్ఐలకు తగిన గుర్తింపు ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు లేదా స్వగ్రామాల్లో వారికి అవసరమైన సహాయం అందేలా పార్టీ వ్యవస్థ పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. వ్యక్తిగతంగా ఒక ఎన్ఆర్ఐ అధికారులను సంప్రదించడంలో ఎదుర్కొనే ఇబ్బందులకు బదులుగా, పార్టీ సంస్థాగతంగా వారి వెనుక నిలబడే విధానం ఉండాలని పేర్కొన్నారు. ఏపీఎన్ఆర్‌టీ ప్రభుత్వ సంస్థ కాగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ పార్టీకి సంబంధించిన సంస్థాగత వేదికగా పనిచేస్తుందని ఆయన వివరించారు. ఏపీఎన్ఆర్‌టీ ద్వారా ఒక సమస్యకు స్పందన రాకపోయినా, పార్టీ వ్యవస్థ ద్వారా సమస్యను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని, వ్యక్తిగతంగా కాకుండా పార్టీ ఒక బలమైన స్వరంగా నిలవాలన్నదే ఉద్దేశమని చెప్పారు.
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ భవిష్యత్ ప్రణాళికల్లో అత్యంత ప్రాధాన్యత పొందుతున్న అంశం నియోజకవర్గ స్థాయి ఎన్ఆర్ఐ హెల్ప్‌డెస్క్ వ్యవస్థ. ప్రస్తుతం ఉన్న దేశ, రాష్ట్ర, రీజినల్ కోఆర్డినేటర్ వ్యవస్థకు భిన్నంగా, ఎన్ఆర్ఐలను నేరుగా వారి స్వగ్రామ నియోజకవర్గాలతో అనుసంధానించే విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు గురురాజా తెలిపారు.
ఒక నియోజకవర్గానికి ఆ ప్రాంతంతో ప్రత్యక్ష అనుబంధం ఉన్న ముగ్గురు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులను ఎంపిక చేయడం, వారితో పాటు స్థానికంగా పార్టీ కార్యకలాపాల్లో అనుభవం, ఎమ్మెల్యే లేదా స్థానిక పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న ఇద్దరు స్థానిక ప్రతినిధులను కలిపి మొత్తం ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని గురురాజా వెల్లడించారు. ఈ ఐదుగురు కలిసి ఆ నియోజకవర్గానికి ఎన్ఆర్ఐ హెల్ప్‌డెస్క్‌గా పనిచేస్తారని పేర్కొన్నారు.
అమెరికాతో పాటు అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రభుత్వంతో ప్రవాసులు మరింత అనుసంధానం అయ్యే అవకాశాలు మెరుగవుతాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో తమకున్న సాధారణ పనులు సులువుగా పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ స్థాయి హెల్ప్‌డెస్క్‌కు ప్రవాసాంధ్రులు ముందుగానే సమాచారం ఇస్తే ఆ నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ వెంటనే స్థానిక కమిటీ సభ్యులతో సమన్వయం చేసి, సంబంధిత అధికారులను సంప్రదించి, నిబంధనలకు అనుగుణంగా పని పూర్తయ్యేలా సహకరించే వ్యవస్థను రూపొందిస్తామని అన్నారు.
ఇలాంటి వ్యవస్థ వల్ల ప్రవాసాంధ్రుల్లో పార్టీ పట్ల నమ్మకం పెరుగుతుందని, పార్టీ అంటే కేవలం ఎన్నికల సమయంలో ఓటు లేదా విరాళం అడిగే సంస్థ కాకుండా, అవసరమైన సమయంలో తమకు అండగా నిలిచే సంస్థ అనే భావనను పెంపొందించడానికి వీలు ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రవాసాంధ్రుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నైపుణ్యం, వ్యాపార అనుభవం, పెట్టుబడి సామర్థ్యం వంటి వనరులను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో అనుసంధానం చేయాలని, అందుకే ఎన్ఆర్ఐ టీడీపీకి భవిష్యత్తులో కేవలం రాజకీయ కార్యక్రమాలే కాకుండా, ప్రవాసాంధ్రులు–స్థానిక నాయకత్వం–ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మధ్య ఒక బలమైన అనుసంధాన వేదికగా మారాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
ఎక్కడో కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ప్రారంభమై వైద్యవృత్తి సహకారంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే సంస్థాగత వేదికపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో డా. గురురాజా ముందుకు సాగుతున్నారు. ప్రవాసాంధ్రుల క్రియాశీల భాగస్వామ్యం, స్వగ్రామాలతో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా జన్మభూమితో సంబంధాలను తెంచుకోకుండా పెంచుకోవాలనే సూత్రమే తనను ముందుకు నడిపిస్తోందని ఆయన అన్నారు. ఇదే దిశగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కొత్త అధ్యాయం ప్రారంభించబోతోందని డా. పిల్లారిశెట్టి గురురాజా పేర్కొన్నారు.





