🕑 Published: August 19, 2026 at 08:19 PM CST
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంక్లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ పాల్గొని సేవలు అందించింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సుమారు 5400 పౌండ్ల (సుమారు 2.4 టన్నులు) ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాక్ చేశారు. ఈ ఆహారం ద్వారా దాదాపు 4500 మంది నిరుపేదలకు పౌష్టికాహార భోజనం అందనుంది.
ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


