🕑 Published: August 19, 2026 at 08:08 PM CST
అట్లాంటిక్ మహాసముద్రంపై రెగల్ ప్రిన్సెస్ క్రూయిజ్‌లో జూలై 25 నుంచి ఆగస్టు 1, 2026 వరకు ‘శ్రీమద్భాగవత సప్తాహం–సాగర సప్తాహం’ నిర్వహించారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా, కెనడా, భారత్ తదితర దేశాల నుంచి దాదాపు 150 మంది పాల్గొన్నారు. జూలై 25న సంధ్యావందనం బోధనతో కార్యక్రమాలు ప్రారంభమై, జూలై 26న దీక్షా కంకణ ధారణ అనంతరం భాగవత సప్తాహం ప్రారంభమైంది. జూలై 26 నుంచి 31 వరకు ప్రతిరోజూ శ్రీమద్భాగవత ప్రవచనాలు నిర్వహించగా, ఆగస్టు 1న దీక్షా కంకణ విరమణతో సప్తాహం ముగిసింది. క్రూయిజ్ ఫోర్ట్ లాడర్‌డేల్ నుంచి బయలుదేరి రోటాన్ (హోండురాస్), బెలీజ్ సిటీ (బెలీజ్), కోజుమెల్ (మెక్సికో) మీదుగా తిరిగి ఫోర్ట్ లాడర్‌డేల్ చేరుకుంది. యాత్రలో భక్తి గీతాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ యాత్రలో భాగంగా పద్మాకర్ 30వ శతావధానం కూడా నిర్వహించారు. అవధాన ప్రక్రియలో భాగంగా పలువురు పృచ్ఛకులు ఇచ్చే సాహిత్య సవాళ్లకు సమాధానాలు ఇస్తూ కవితా సృజనను ప్రదర్శించారు. సముద్ర ప్రయాణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా భాగవత ప్రవచనాలతో పాటు భారతీయ సాహిత్య సంప్రదాయానికి కూడా వేదిక లభించింది. కార్యక్రమాల నిర్వహణకు ప్రిన్సెస్ క్రూయిజ్ సేల్స్, ప్లానింగ్, ఆన్‌బోర్డ్, క్యులినరీ, గెస్ట్ సర్వీసెస్, ఆపరేషన్స్ విభాగాలు సహకరించాయి. ఏడు రోజుల యాత్రలో వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు కలిసి ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రధాన అంశంగా నిలిచింది.



