🕑 Published: August 19, 2026 at 08:15 PM CST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(TAL) నిర్వహించిన వార్షిక క్రికెట్ టోర్నమెంట్ తాల్ ప్రీమియర్ లీగ్(TPL) 2026 ఉత్సాహంగాముగిసింది. ఆగస్టు 16న లాంగ్లీ, స్లౌ క్రికెట్ క్లబ్‌లో జరిగిన మెగా ఫైనల్‌లో ఐటి ట్రీ వారియర్స్ విజయం సాధించి ఛాంపియన్స్‌గా నిలవగా, సూపర్ స్టార్స్ రన్నర్స్-అప్‌గా నిలిచింది. వైజాగ్ బ్లూస్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. 14 వారాల పాటు సాగిన టోర్నమెంట్‌లో 10 జట్లు 51 మ్యాచ్‌లు ఆడగా, 200 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు.
మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజా ప్రతినిధి వీరేంద్ర శర్మ ముఖ్య అతిథిగా హాజరై విజేతలు, రన్నర్స్-అప్‌లకు ట్రోఫీలు అందజేశారు. TAL వ్యవస్థాపక సభ్యుడు డా. రాములు దాసోజు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటి ట్రీ వారియర్స్ కెప్టెన్ ఆకాశ్ బండారి, యజమాని వికాస్ పర్రే; సూపర్ స్టార్స్ కెప్టెన్ కృష్ణ అల్ల, యజమాని వేణు నవులూరి; వైజాగ్ బ్లూస్ కెప్టెన్ శ్రీనివాస్ సురభి, యజమాని రవి బండారు. డి జె వారియర్స్‌కు ఫెయిర్ ప్లే అవార్డు లభించింది. ధనంజయ మద్దుకూరి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఉత్తమ బౌలర్‌గా, ఆకాశ్ బండారి ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా, సాయి అమృత్ రెడ్డి వెన్న ఉత్తమ ఫీల్డర్/కీపర్‌గా ఎంపికయ్యారు.
TAL ఛైర్మన్ రవి సబ్బా విజేతలను అభినందిస్తూ, 2008లో ప్రారంభమైన TAL క్రికెట్ కార్యక్రమం 2012లో TPL రూపంలో కొనసాగుతున్న విధానాన్ని వివరించారు. టోర్నమెంట్ నిర్వహణలో స్పోర్ట్స్ ఇంచార్జ్ సింధూర చెరకు, స్పోర్ట్స్ ట్రస్టీ సత్య పెద్దిరెడ్డి, TPL కమిటీ సభ్యులు హర్ష కాగితాల, శరత్ పుట్టతో పాటు ట్రస్టీలు కిరణ్ కప్పెట, అనిల్ అనంతుల, అశోక్ మాడిశెట్టి, రవి మోచర్ల, వెంకట్ నేల తదితరుల సహకారాన్ని TAL అభినందించింది. స్టీరింగ్ కమిటీ, వాలంటీర్లు, అడ్వైసరీ, డిసిప్లినరీ కమిటీ సభ్యులు, స్పాన్సర్లు, ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో పిల్లలు, పెద్దల కోసం ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
TPL వేడుకలతో పాటు TAL నిర్వహించిన ‘1 Million Steps in 100 Days’ ఛాలెంజ్‌లో పాల్గొన్న సుమారు 80 మందిని సత్కరించి పతకాలు అందజేశారు. మే 7 నుంచి ఆగస్టు 15 వరకు సాగిన ఈ కార్యక్రమానికి వెంకట్ తోటకూర, శ్రీహరి అరిగె, సునీత అరిగె నాయకత్వం వహించారు. రోజువారీ నడక, శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతదేశంలోని వెనుకబడిన పిల్లలకు మద్దతుగా నిధుల సమీకరణ కూడా చేపట్టారు. TPL 2026 విజయవంతానికి సహకరించిన ఆటగాళ్లు, వాలంటీర్లు, మద్దతుదారులు, కుటుంబ సభ్యులకు TAL కృతజ్ఞతలు తెలిపింది.


