🕑 Published: August 30, 2026 at 11:07 AM CST
పలు దశాబ్దాలుగా డాలస్‌లోని పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ వంటి సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన డా. భానుమతి ఇవటూరి(90) ముదిమి వయసులో మాతృదేశం భారత్‌కు పయనమైన సందర్భంగా డాలస్‌లో ఆమెను పలువురు ప్రవాస సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(IANT) పూర్వాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్(TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె, అమెరికన్ తెలుగు అసోసియేషన్(ATA) తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ(NATS) పూర్వాధ్యక్షుడు బాపు నూతి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం, కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్ ప్రసాద్, రావు కల్వల, డా. పుదూర్ జగదీశ్వరన్‌లు ఆమెను జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.
డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ సమస్యకు-పరిష్కారానికి మధ్య, వివాదానికి-అవగాహనకు మధ్య, గందరగోళానికి-స్పష్టతకు మధ్య, నిరాశకు-ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారని కొనియాడారు. మనవల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయనే ప్రామాణికత ఆధారంగా విజయాన్ని లెక్కించాలనే ఆమె సూత్రం ఆదర్శనీయమని అన్నారు. అమెరికాలో 50ఏళ్లు జీవించిన అనంతరం చరమాంకంలో ఇండియాకు పయనమనమవుతున్న డా. భానుమతి జీవితం ఆనందంగా గడవాలని శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రవాసులు భానుమతి సేవలను కొనియాడారు.




