🕑 Published: September 01, 2026 at 09:48 AM CST
తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో(TCAGT) ఆధ్వర్యంలో ఆదివారం నాడు ప్రముఖ కవి, రచయిత, విద్యావేత్త, సామాజికవేత్త బండ్ల మాధవరావు ముఖ్య అతిథిగా సాహితీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సంస్థ కార్యదర్శి ప్రవళిక కూన స్వాగతం పలికారు. అధ్యక్షుడు శివ యెల్లాల కెనడాలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య సంప్రదాయాలను పరిరక్షించి, ప్రోత్సహించడమే TCAGT ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలుగు భాషకు సేవ చేసిన గిడుగు రామమూర్తి పంతులు కృషికి నివాళులర్పించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలు దేవి చౌదరి మాధవరావు సాహిత్య రచనలపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. “పొలంగట్ల వెంట” నుంచి ఎంపిక చేసిన కొన్ని కవితలను ఆమె పఠించారు. TCAGT సీనియర్ అడ్వైజర్ సూర్య బెజవాడ కెనడాలోని తెలుగు కుటుంబాల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో, వ్యాపార రంగానికి సహకరించడంలో, కమ్యూనిటీ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడంలో, పిల్లలకు తెలుగు భాషను నేర్చుకునేలా, తమ తెలుగు వారసత్వాన్ని తెలుసుకుని గర్వించేలా అవకాశాలు కల్పించడంలో TCAGT పోషించిన పాత్రను వివరించారు. కెనడాలో APNRT స్టేట్ కోఆర్డినేటర్‌గా నియమితులైన రియాజ్ అలీని సత్కరించారు.
బండ్ల మాధవరావు ప్రసంగిస్తూ కెనడాలో తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు TCAGT నాయకత్వం, వాలంటీర్లు, సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. కెనడా, ఉత్తరఅమెరికా వ్యాప్తంగా తెలుగు సంఘాలు సాంస్కృతిక మార్పిడి, భాషా అభ్యాసానికి, ముఖ్యంగా యువతరానికి వేదికలను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశాల అభివృద్ధికి, అదే సమయంలో తమ మాతృభూమి అభ్యున్నతికి కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. తన రచనలు “పొలంగట్ల వెంట”, “ఏడాదికొక సారైనా”, “బతుకు తెరవైంది” నుండి కవితలను ప్రస్తావిస్తూ, వాటిలోని లోతైన సామాజిక, తాత్విక భావాలను వివరించారు. కీలక ప్రసంగం అనంతరం ప్రశ్నోత్తర, ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సభికులు సాహిత్యం, విద్య, తెలుగు భాష పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి పలు అంశాలపై ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగారు. వాటికి ఆయన ఆసక్తికరమైన వివరణలు ఇచ్చారు. అనంతరం మాధవరావు దంపతులను సత్కరించారు. www.telugutoronto.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సంస్థ కార్యవర్గం కోరింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పద్మిని యెల్లాల, కోశాధికారి తేజ వాఝా, మౌనిక, నవీన్ వడ్లమూడి, శ్రీనివాస్ కాడి, శరత్ కూన, సూరజ్ పెండం తదితరులు కృషి చేశారు. రాజేష్ వీరెళ్ల, అనిత బెజవాడలు సహకరించారు.



