🕑 Published: September 04, 2026 at 09:38 PM CST
డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గొప్ప విద్యావేత్తే కాకుండా తెలుగులో చక్కని కవి, విమర్శకుడు అని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. తిమ్మాపురం విజ్ఞాన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆచార్య వెలమల సిమ్మన్న రాసిన "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" అనే గ్రంథాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కట్టమంచి వారు ముసలమ్మ మరణం, నవయామిని, కవితత్త్వ విచారం, అర్థశాస్త్రము, పంచమి, వ్యాస మంజరి మొదలైన గ్రంథాలు రాసి ఆధునిక యుగానికి యుగపురుషుడయ్యారని తెలిపారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా ఎదగడానికి డాక్టర్ కట్టమంచి చేసిన సేవలు అమోఘం, అద్వితీయం అన్నారు. విమర్శకుడిగా కట్టమంచి పాత్రను ఆచార్య వెలమల సిమ్మన్న "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" పుస్తకంలో చక్కగా వివరించారన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సిమ్మన్న గ్రంథాలు వివిధ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ గ్రంథం కూడా చాలా ప్రామాణికమైనదన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థలు ప్రతి నెల తప్పనిసరిగా భాషా సాహిత్యానికి సంబంధించి ఒక ఉపన్యాసం ఏర్పాటు చేయాలని కోరారు. ఏయూ ఘనత ఈరోజు దేదీప్యమానంగా ఉండడానికి ప్రధాన కారకులు కట్టమంచి రామలింగారెడ్డి అని ఆచార్య యార్లగడ్డ కొనియాడారు. విజ్ఞాన్ విద్యాసంస్థల సీఈవో శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సభ పెట్టుకోవడానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తమకు మంచి అవకాశం ఇచ్చారని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సిమ్మన్న పుస్తకావిష్కరణ జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏయూ తెలుగు శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ కట్టమంచి రామలింగారెడ్డి వలన ఆంధ్ర విశ్వకళాపరిషత్తు అత్యున్నతమైన స్థాయికి చేరుకుందని, ఉత్తమ ప్రమాణాలతో విద్యను ప్రసాదించిన మహనీయుడు కట్టమంచి అని కొనియాడారు. గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ కట్టమంచి రామలింగారెడ్డి ఆచార్యులకే ఆచార్యులని కొనియాడారు. భారతీయ అలంకారిక శాస్త్రవేత్తలైన భరతుడు, దండి, విశ్వనాథుడు, మమ్ముటుడు, జగన్నాథ పండితరాయలు, భోజుడు మొదలైన వారి గురించి అధ్యయనం చేయడమే కాకుండా పాశ్చాత్యుల విమర్శనా సిద్ధాంతాలను తెలుగు సాహిత్యానికి అన్వయించి సుసంపన్నం చేశారని చెప్పారు.



