🕑 Published: September 06, 2026 at 11:35 AM CST
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా సమష్టి కృషి అవసరమని హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి (Jaya Peesapati) అన్నారు. సింగపూర్‌లో పర్యటిస్తున్న ఆమె అక్కడి తెలుగు వారిని కలిసి ముచ్చటించారు. జయ పీసపాటి రాకను పునస్కరించుకొని శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సుబ్బు పాలకుర్తి సమన్వయపరిచిన ఈ కార్యక్రమానికి జయ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.
మీడియా సహా వివిధ రంగాల్లో మహిళలు మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తారని జయ పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆమె అన్నారు. విదేశాల్లో నిర్వహించే తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం తనకు 2016లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. సింగపూర్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు రత్నకుమార్ మాట్లాడుతూ.. జయ పీసపాటితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2016లో తొలిసారి పరిచయం.. అనంతరం జూమ్ వేదికగా నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా హాంకాంగ్ తెలుగు సమాఖ్యతో తమ అనుబంధం మరింత బలపడిందని తెలిపారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆమె సలహాలు సూచనలు తీసుకోవడం అలవాటుగా మారిందన్నారు. రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లి, సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.


