🕑 Published: September 07, 2026 at 04:12 PM CST
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వైద్య కళాశాలలు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అమెరికాలోని అట్లాంటా నగరంలో సెప్టెంబర్ 6న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల పూర్వ విద్యార్థులు, పలువురు సూపర్ స్పెషాలిటీ వైద్యులు సహా వెయ్యి మందికిపైగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తితిదే (TTD) బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు... బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్విమ్స్, బర్డ్, అశ్విని హాస్పిటల్, పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి, ఎస్వీ గోసంరక్షణ శాల తదితర వైద్య సంస్థల్లో భక్తులకు నిస్వార్థంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి వైద్య సేవ కార్యక్రమంపై వైద్యుల నుంచి చక్కటి స్పందన లభించిందని సదాశివరావు తెలిపారు. తాము స్వదేశానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా శ్రీవారి వైద్య సేవలో పాల్గొని భక్తులకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు వైద్యులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు భక్తులకు స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించేందుకు శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని తితిదే ఈవో ఎం.రవిచంద్ర జూన్ 5న ట్రయల్ రన్‌గా ప్రారంభించారు. ఇప్పటికే పలువురు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. దేశ, విదేశాల్లోని ప్రముఖ వైద్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి భక్తులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తితిదే కృషి చేస్తోందని సదాశివరావు తెలిపారు.