🕑 Published: September 20, 2026 at 08:49 AM CST
2023లో స్థాపించిన గ్లోబల్ తెలంగాణా సంఘం (జీటీఏ) ప్రస్తుతం 54 దేశాల్లో విభాగాలు కలిగి ఉంది. శనివారం నాడు టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ విభాగాలను 100 దేశాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ కలవాల విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. జన్మభూమికి కర్మభూమికి మధ్య వారధిగా సంస్థ ఉండాలని, స్థానికంగా ఉన్న తెలంగాణకు చెందిన ప్రవాసులను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణా ప్రవాసులు ఎక్కడ ఉంటే అక్కడ జీటీఏ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. బోర్డు సమావేశానికి ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణా సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న జీటీఏను ఆయన అభినందించారు. సాయంకాలం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీటీఏ డాలస్ విభాగ నాయకత్వాన్ని ప్రకటించారు. అమెరికావ్యాప్తంగా జరిగే తెలంగాణా కార్యక్రమాలకు డాలస్ విభాగం దిక్సూచి కావాలని వక్తలు ఆకాంక్షించారు. స్థానిక ప్రవాసుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ కేశిరెడ్డి ప్రవీణ్, అధ్యక్షుడు కేతిరెడ్డి బాపురెడ్డి, ఉపాధ్యక్షులు ప్రవీణ్ బిల్లా, మధు, ప్రవీణ్‌కుమార్, తదుపరి అధ్యక్షుడు రవీందర్ గడ్డంపల్లి, ఈసీ సభ్యులు దుషంత్ రెడ్డి, హరి, సుధీర్, వంశీ, BOTలు అమర్, అరుణ్, బిందు, కోట్య, కృష్ణ, మహేష్, మన్మోహన్, మోహన్, నరసింహారెడ్డి, ప్రవీణ్, ప్రేమ్, రఘు, రాజేందర్, సుమ, సురేందర్, సుశాంత్, విజయ్, డాలస్ నుండి సందీప్ జంబుల, సంతోష్ చెరుకు, కిరణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.










