🕑 Published: October 19, 2026 at 04:43 PM CST
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(TPAD) ఆధ్వర్యంలో శనివారం నాడు వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలను టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని కొమెరికా సెంటర్లో ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన బతుకమ్మ ఆటపాటలు ప్రాంగణానికి తెలంగాణ సంప్రదాయ పరిమళాలతో కొత్త వన్నెలద్దాయి. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ నటుడు నవీన్ పోలిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని తన ప్రదర్శనతో అలరించారు. గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ‘ఇన్ఫ్యూజన్ బ్యాండ్’ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. టి-ప్యాడ్ అధ్యక్షురాలు లక్ష్మీ పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డిల నేతృత్వంలో 20 కమిటీలకు చెందిన వాలంటీర్లు గడిచిన మూడు నెలలుగా ఈ కార్యక్రమం కోసం కృషి చేశారు.







