ప్రవాస భారతీయుల జీవనశైలిపై డల్లాస్‌లో అవగాహన సదస్సు

Featured Image

ప్రవాస భారతీయుల జీవనశైలిపై డల్లాస్‌లో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. ఈ దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.

అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు సూచనలు చేశారు. ఈ అవగాహనా సదస్సును డా. ప్రసాద్ తోటకూర సమన్వయపరిచారు.

* అమెరికా విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదిక మీద భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి. జాతీయ గీతాలు ఆలపించేటప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలపించాలి.

* భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలలో ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. ఇలాంటివి గృహాల మధ్యలో గాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం.

* భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు థియేటర్ల వద్ద హడావుడి శ్రుతిమించుతోంది. థియేటర్లత్లో వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమా ప్రేక్షకులు మన పట్ల ఏహ్యభావాన్ని పెంచుకుంటున్నారు.

* రాజకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో చేసే రగడ సమంజసం కాదు. సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాదు. సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో ఇతరులు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేస్తున్న అరుపులు, కేకలకు పోలీసులు వచ్చి వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.

* చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగమవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంబంధాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.

* మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. 1856లో ఏర్పడ్డ డాలస్ నగరాన్ని డాలస్ పురంగా ఉల్లాసపురంగా పలకడం, 1913లో ఏర్పడ్డ క్యారల్టన్ నగరాన్ని కేరళాటౌన్ గా పలకడం (ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక), 1950లో ఏర్పడ్డ గంటర్ నగరాన్ని గుంటూరుగా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలో పడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు! ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.

* వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.

* సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.

* భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడతగినది.

డాలస్ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం తదితరులు పాల్గొని ప్రసంగించిన వారిలో ఉన్నారు.

Tags-How NRIs Embarrassing Others With Their Unwelcoming Lifestyle

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles