🕑 Published: July 28, 2026 at 10:47 AM CST
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. యుకే నలుమూలల నుంచి సుమారు 2,500 మందికి పైగా ప్రవాస తెలంగాణ కుటుంబాలు ఈ వేడుకలకు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు నాయకత్వంలో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీకాంత్ జెల్ల, గణేష్ కుప్పాల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లో మేయర్ రంజిత్ గిల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
స్వదేశంలో నిర్వహించే సంప్రదాయానికి అనుగుణంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపుతో బోనాల జాతరకు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బోనాలు సమర్పించగా, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కుటుంబ సమేతంగా ఇటువంటి వేడుకలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని, భిన్న సంస్కృతులను ఆదరించే బ్రిటన్ వంటి దేశంలో అందరూ ఐక్యంగా కలిసి ఉండాలని ముఖ్య అతిథులు పేర్కొన్నారు.
టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సంఘాలు తెలంగాణ సంస్కృతిని విస్తృతంగా చాటుతున్నాయని, దీనికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన కారణమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నాయకత్వం వహించిన తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బోనాల పండుగను మరింత వైభవంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ప్రవాస తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి టాక్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం అందిస్తున్న మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి బోనాల వేడుకలకు హాజరైన అతిథులు, ప్రవాస కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళలు బోనాలతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో టాక్ చేపట్టనున్న కార్యక్రమాలను సభకు వివరించారు. ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు బోనాల జాతర విజయవంతం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం సహకారం, సూచనలు, ప్రోత్సాహం వల్లే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించగలిగామని తెలిపారు. ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, లండన్‌లో తెలంగాణ పండుగను ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణమని, ప్రవాస సంఘాల కృషితో బోనాలు, బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, టాక్ కార్యవర్గం, స్థానిక సంస్థలు, అతిథులు, ప్రవాస తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్పాన్సర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులను టాక్ ఎగ్జిక్యూటివ్ టీమ్ జ్ఞాపికలతో సత్కరించింది. కార్యక్రమంలో రత్నాకర్ కడుదుల, శుష్మణ రెడ్డి, సుప్రజ పులుసు, అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, గణేష్ కుప్పాల, పవిత్ర, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగిళి, సత్య చిలుముల, మట్టా రెడ్డి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్ జెల్ల, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీవిద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణి తేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయి రావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్, నవ్య, ఉమా తదితరులు పాల్గొన్నారు.







