ఆటా బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్న అమెరికా కాన్సుల్ జనరల్

Featured Image

అమెరికా-భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో హైదరాబాద్ కీలకంగా మారిందని స్థానిక అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ టి హబ్ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మధు యాష్కీ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మెన్ శివసేనారెడ్డిలతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తెలుగులో అందరికి నమస్కారం... అందరూ మంచిగున్నారా... అంటూ లారా ఉత్సాహపరిచారు. భారతీయ పెట్టుబడిదారులు ఇప్పటికే అమెరికాలో 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక నమ్మకం, భాగస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ వేగంగా అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఎదుగుతోందని లారా విలియమ్స్ ప్రశంసించారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ సాధించిన ప్రగతి ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని ఆమె అన్నారు. ఆటా చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందని, రైజింగ్ తెలంగాణగా మారిందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రామసహాయం రెడ్డి, సిఐఐ వైస్ ప్రెసిడెంట్ గౌతం రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.

Tags-Hyderabad USA Consul General Lara Williams Attends ATA Business Seminar

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles