ఓయూ వీసీతో ఆటా బృందం భేటీ

Featured Image

అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ప్రతినిధి బృందం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం ఆహ్వానం మేరకు ఆయనను కలసి, విశ్వవిద్యాలయ అభివృద్ధి, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంపై చర్చించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షుడు పర్మేష్ భీమ్‌రెడ్డి, ట్రస్టీ కాశీ కోత, విద్యా సలహాదారు ప్రొఫెసర్ రాజశేఖర్, ఆటా ఇండియా సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్ని అసోసియేషన్(OUAA–గ్లోబల్) అధ్యక్షుడు హరినాథ్ మేడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీని ఉస్మానియా యూనివర్సిటీ అలుమ్ని అసోసియేషన్ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఈ. సుజాత సమన్వయం చేశారు.

సమావేశంలో ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ విద్యా నాణ్యతను మరింత పెంపొందించడంలో ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, 2024లో 70కు పైబడిన స్థానం నుంచి 2025 నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఓవరాల్ విభాగంలో 53వ స్థానాన్ని ఉస్మానియా యూనివర్సిటీ దక్కించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో 7వ స్థానాన్ని కూడా సాధించినట్లు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయ విద్యా-మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడాలని ఉపకులపతి కోరారు. 2026 జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా అంతర్జాతీయ సదస్సుకు ప్రొ కుమార్ బృందాన్ని ఆహ్వానించారు. ఈ సదస్సులో ఓస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్ నిర్వహించి, విశ్వవిద్యాలయ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి సూచనలు సేకరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతును సమీకరించే అవకాశం కల్పించనున్నారు.

Tags-ATA Team Meets OU VC Prof Kumar

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles