విజయవంతంగా నెబ్రాస్కా తెలుగు సమితి తొలి యువజన సదస్సు

Featured Image

నెబ్రాస్కా తెలుగు సమితి(TSN) ఈ ఏడాది తొలిసారిగా యూత్ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహించింది. ఈ వినూత్న సదస్సు ద్వారా ఇండియన్ అమెరికన్ విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి తమ ఆలోచనలను పంచుకున్నారు. 7వ తరగతి నుంచి కాలేజ్ విద్యార్థుల వరకు లక్ష్యంగా రూపొందించిన ఈ సదస్సుకు అద్భుత స్పందన లభించిందని సమితి అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ అన్నారు. కనెక్ట్‌గా ఉండండి, మీ మూలాలను మర్చిపోకండి, అప్పుడు మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండరని ఆయన అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. విద్యా, వృత్తి మార్గాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం, తమ ఇండియన్ అమెరికన్ గుర్తింపుతో, సాంస్కృతిక విలువలతో ముడిపడి ఉండేలా చేయడం, సంప్రదాయ కెరీర్ కౌన్సెలింగ్‌కు మించి, నాయకత్వ వికాసం, సామాజిక విలువలపై ప్రత్యేక దృష్టి సారించడమే ఈ సదస్సు లక్ష్యాలు.

యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌లో అనస్తీషియాలజీ ప్రొఫెసర్ డా. గురుదత్ పెండ్యాల వైద్య రంగం, పరిశోధనల్లో అవకాశాలపై, యూనియన్ పసిఫిక్ లేబర్ రిలేషన్స్ మేనేజర్, నెబ్రాస్కా జపనీస్ అనిమేషన్ సొసైటీ స్థాపకురాలు రెబెక్కా పాటర్ నాయకత్వం, బహుళ సంస్కృతుల సమన్వయంపై, TSN వ్యవస్థాపక అధ్యక్షుడు క్రాంతి ఆదిదం వ్యాపార వ్యూహాలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌పై మార్గనిర్దేశం చేశారు.

సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్యానల్ డిస్కషన్‌లో ఆది సేతుపతి (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్), అపూర్వ కుంటే (న్యాయం), క్రాంతి సుధ (బిజినెస్), సుకార్న్ చొక్కర (మెడిసిన్), సాకేత్ మద్దిపాటి (ఎంటర్‌టైన్‌మెంట్ రంగం) తమ కెరీర్ ప్రయాణాల్లో ఎదురైన సవాళ్లు, నేర్చుకున్న పాఠాలను వివరించారు. TSN యూత్ కమిటీ చైర్ క్రాంతి సుధ, కో-చైర్ వివేక్ పోషాల, కార్యదర్శి వీణామదురి ద్రోణాదుల, కోశాధికారి కీర్తి సుధ, వాలంటీర్లు ఆర్య యర్లగడ్డ, అరుష్ పుంటాంబేకర్, సమన్వి కాంతెం, మాన్స్వి పడాల, కృష్ణ చైతన్య రావిపాటిలు సదస్సు నిర్వహణకు సహకరించారు.

Tags-Telugu Samithi of Nebraska First Youth Conference

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles