పాడిపంటలతో పరిఢవిల్లుతున్న ప్రవాసాంధ్రులు-TNI ప్రత్యేకం

Featured Image

  • వ్యవసాయం చేస్తున్న ప్రవాసాంధ్రులు
  • పెరుగుతున్న వ్యవసాయ భూముల కొనుగోళ్లు
  • భవిష్యత్ రియల్ ఎస్టేట్ విలువలపై కోటి ఆశలు
  • కూలీలు తక్కువ...సాంకేతికత ఎక్కువ
  • పప్పులు కూరగాయలు పండ్ల సాగుతో పాటు గోశాలల నిర్వహణ
  • పాడి పెంపకంతో రాంచ్ యజమానులకు పన్ను మినహాయింపు
  • 600 ఎకరాల్లో 3000 జెర్సీ ఆవులతో గోశాల. రోజుకి 66వేల లీటర్ల సేకరణ. లీటరు రూ.18.
  • ఖండాలు దాటినా తల్లివేరు మరిచిపోకుండా ప్రవాసాంధ్రులు మట్టితో చుట్టరికాన్ని, పాడిపంటలపై ప్రేమాభిమానాలను చాటుతూ ప్రకృతి ప్రేమికులుగా పరిఢవిల్లుతున్నారు. అమెరికా వ్యవసాయ భూముల్లో భారతీయ ప్రవాసులు ముఖ్యంగా ప్రవాసాంధ్రుల పెట్టుబడులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. కోవిద్ అనంతరం ద్రవ్యనిధి లభ్యత పెరగడంతో ప్రవాసాంధ్రుల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ, వైద్యం, వ్యాపార రంగాల్లో స్థిరపడిన అనంతరం దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం వారు వ్యవసాయ భూముల ఆసరాతో రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. వ్యవసాయ భూములు తక్కువ పెట్టుబడితో కొనుగోలు చేయగలగడం, పెద్ద స్థలాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉండడం, భవిష్యత్తులో భూమి విలువ పెరుగుతుందనే నమ్మకం...వారి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

    * రియల్ ఎస్టేట్ విలువలపై ఆశతో

    భూమి విలువ పెరుగుదలతో పాటు, పన్ను నియమాలు కూడా ఈ పెట్టుబడి ధోరణికి మరింత వేగం తెచ్చాయి. అమెరికాలో వ్యవసాయ కార్యకలాపాలు సాగించే భూములకు అత్యల్పంగా భూమి శిస్తు ఉంటుంది. వ్యవసాయం, పాడి పెంపకం తప్పనిసరిగా చేసే భూములకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అనేకమంది ప్రవాసులు వాతావరణ అనుకూలతను బట్టి తమ పెరటిలో కుండీల్లో పూలమొక్కలు, పాదులతో కూరగాయలు, భూమి ఉంటే పశువులు-కోళ్ల పెంపకం, ప్రత్యేక పంటల సాగు వంటి ప్రయోగాలు ప్రారంభిస్తున్నారు. పూర్తి స్థాయి రైతులుగానే గాక, కొంతమంది దీన్ని ఒక అదనపు ఆదాయ వనరుగా కూడా వినియోగించుకుంటున్నారు. వారాంతాల్లో పొలానికి వెళ్లడం, పంటల పెరుగుదలను పర్యవేక్షించడం, పశువుల పెంపకం ద్వారా గ్రామీణ జీవనాన్ని ఆస్వాదించడమే గాక పన్ను ప్రయోజనాలను పొందుతున్నారు. టెక్సాస్-ఒక్లహోమా సరిహద్దుల్లో 17ఎకరాల్లో నరసరావుపేటకు చెందిన ప్రవాసాంధ్ర రైతు సేంద్రీయ పద్ధతుల్లో పలురకాల కూరగాయలు పండించి స్థానిక భారతీయ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

    ప్రవాస తెలుగువారి పెట్టుబడుల వలన అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో ఒక కొత్త రకమైన వలస ప్రభావం కూడా కనిపిస్తోంది. దశాబ్దాలుగా స్థిరంగా ఉన్న వ్యవసాయ భూముల మార్కెట్ ఇప్పుడు వివిధ దేశాల పెట్టుబడిదారుల ప్రవేశంతో కొత్త పుంతలు తొక్కుతోంది. భవిష్యత్తులో నివాస స్థలంగా మార్చుకోవాలనే ఆలోచనతో, పెట్టుబడి ధోరణితో లేదా వ్యవసాయంపై పూర్తి మక్కువతో ఆయా భూములను కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుందనే ఆశతో కూడా కొనుగోలు చేసేవారు ఈ మధ్య పెరుగుతున్నారు. భూములు ఉన్న ప్రాంతంలో నివసించని పెట్టుబడిదారులు స్థానిక రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని భూమిని వారికి లీజ్‌కు ఇచ్చి వ్యవసాయాన్ని కొనసాగించేలా చూస్తున్నారు. లేదా వీరే స్థానిక కూలీలను నియమించుకుని సొంతంగా సాగు చేస్తున్నారు.

    విదేశీ పెట్టుబడిదారుల ప్రవేశం భూమి ధరలను పెంచి స్థానిక రైతులకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రభావితం చేస్తుందేమో అన్న సందేహాలు వినిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూముల్లో ప్రవాసాంధ్రుల పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాలకు కొత్త మూలధనాన్ని, ఆధునిక పద్దతులను, భిన్నమైన పంటల ప్రయోగాలను పరిచయం చేస్తోంది. ఆర్థిక లాభాల కోణంలో చూస్తే ఇది అటు పెట్టుబడిదారులకు లాభదాయకంగానే గాక గ్రామీణ అమెరికాలో కొత్త మార్పులకు నాంది పలుకుతోంది. అమెరికా మొత్తం వ్యవసాయ భూముల్లో విదేశీయుల వాటా చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, ఊశ్డా తాజా ఆFఈడా నివేదిక ప్రకారం, 2023లో అమెరికా వ్యవసాయ భూముల్లో 4కోట్ల58లక్షల ఎకరాలు విదేశీ పెట్టుబడిదారుల అధీనంలో ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం ప్రైవేట్ రైతు భూములలో 3.61%కు సమానం. ఈ సంఖ్య 2022తో పోల్చితే 3.6%, 2021తో పోల్చితే 12.2% పెరిగిందని నివేదిక వెల్లడిస్తోంది.

    * రాంచ్‌లలో విస్తృతంగా పాడి పెంపకం

    భూమి పెట్టుబడుల విషయంలో భాగస్వామ్యాలపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువవుతోందని డాలస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ నిపుణుడు అనంత్ మల్లవరపు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో డాలస్ చుట్టుపక్కల తెలుగువారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక రాంచ్‌లు తమ వార్షిక నిర్వహణ ఖర్చులు, ఆస్తి పన్నులను భర్తీ చేసుకోవడానికి ఆయా భూముల్లో ఈవెంట్ సెంటర్లు, ఎయిర్‌బీఎన్‌బీ క్యాబిన్లు నిర్మించి అద్దెకు ఇవ్వడం వంటి వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. పన్ను మినహాయింపుల కోసం...ఆయా రాంచ్‌లలో వ్యవసాయం తక్కువగా పాడి పెంపకం ఎక్కువగా ఉంటోందని అనంత్ వెల్లడించారు. వ్యవసాయ భూముల్లో పెట్టుబడులు పెట్టే వారు దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ విలువ పెరుగుదలను ఆశిస్తూ భూములు కొంటున్నారని తెలిపారు. కొద్దిమంది మాత్రమే నిజంగా వ్యవసాయం లేదా పశుసంవర్థకం వంటి రంగాల్లో శ్రద్ధ చూపిస్తున్నారని.. భూమిని కేవలం పెట్టుబడిగా మాత్రమే చూస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేయకపోవడం వలన కొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలు కోల్పోయి నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని అనంత్ వివరించారు.

    * ఏజీ5 పట్ల మక్కువ

    వ్యవసాయ భూముల పేరిట జరిగే పెట్టుబడుల్లో ప్రత్యేకంగా ఉందివిదెద్ షరె (అవిభాజిత వాటా) రూపంలో జరుగుతున్న విక్రయాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఒకే భూమిని అనేకమందికి భాగాలుగా అమ్ముతూ మోసాలు జరుగుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ విధానంలో ఎవరి వాటా భూమి ఎక్కడ ఉందో, దాన్ని ఎలా వినియోగించుకోవాలో, భవిష్యత్తులో ఎలా అమ్ముకోవాలో స్పష్టత ఉండదు. కేవలం 'అమెరికాలో భూమి కొన్నాం' అన్న భావనకే ప్రాధాన్యం ఇస్తూ భూమి పట్ల హక్కులు, వాడుక పద్ధతులు స్పష్టంగా లేకపోవడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన వివాదాలు రావడం తిరిగి అమ్మడం కష్టమవడం పన్ను మినహాయింపులు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో నిపుణులు ఏజీ5 పద్ధతిని సూచిస్తున్నారు. అమెరికాలో వ్యవసాయ వర్గీకరణ పొందాలంటే భూమి కనీసం 5 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండాలి. ఏ భూమినైనా చిన్న చిన్న భాగాలుగా విభజించి వ్యవసాయ భూమిగా అమ్మాలంటే కూడా, ప్రతి భాగం కనీసం 5 ఎకరాలు ఉండాలి. దీనితో పాటు భూమిలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఏజీ5 భూములకు ప్రాథమిక మౌలిక వసతులు కూడా ఉండాలి. రోడ్లు, డ్రెయినేజ్ సదుపాయాలు వంటి అంశాలు సక్రమంగా అభివృద్ధి చేయాలి. అందుకే ఈ వర్గీకరణలో అమ్మే భూములు మరింత భద్రతతో ఉండటంతో పాటు, వాటి ధర కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాటిపై ప్రవాస తెలుగువారు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

    * నిఖార్సైన ప్రవాసాంధ్ర రైతులు

    రియల్ ఎస్టేట్ పెరుగుతుందమే ఆశతోనే గాక కొందరు ప్రవాస తెలుగువారు వ్యవసాయం పట్ల నిజమైన ప్రేమతో పూర్తి స్థాయి రైతులుగా స్థిరపడుతున్నారు. పంటలు, నేల, పశువులంటే ఆసక్తి కలిగి, డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి కొత్త పద్ధతులను అన్వేషిస్తూ వ్యవసాయాన్ని జీవన విధానంగా స్వీకరిస్తున్నారు. ఆర్థిక లాభం, ప్రకృతితో అనుబంధం, భూమి పట్ల బాధ్యత, గ్రామీణ అమెరికా సంస్కృతితో కలిసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇలాంటి వారు అమెరికా వ్యవసాయ వ్యవస్థకే కాకుండా ప్రవాస భారతీయుల ప్రతిష్ఠకు కూడా ఒక కొత్త దిశ చూపిస్తున్నారు.

    * ఫ్లోరిడాలో గంగిరేగిపళ్లు - గొర్రెపాటి చందు, సుధీర్ దుగ్గిరాల

    బందరుకు చెందిన చందు, రాజమండ్రికి చెందిన సుధీర్ ఇరువురు ఫ్లోరిడా రాష్ట్రం ఒకిచోబీలో సిరి ఫామ్స్ పేరిట పలు రకాల పండ్లను సాగు చేస్తున్నారు. 2023లో ఎకరానికి రూ.8లక్షలకు చొప్పున 400ఎకరాల్లో విస్తరించి ఉన్న 100ఏళ్ల కిందటి డైరీఫాంను కొనుగోలు చేసి అందులో ప్రస్తుతం 250ఎకరాల్లో గంగిరేగిపళ్లు, సీతాఫలం, 7రకాల మామిడి, కొబ్బరి, జామ, రామాఫలం, నేరేడు, వేప, రావి, చింత, ఉసిరి, పనస, ఖర్జూరం సాగు చేస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో డ్రోన్ల సాయంతో వేపనూనె పిచికారీ చేస్తూ సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. వైవిధ్యం-విస్తీర్ణం పరంగా ఫ్లోరిడాలో అతిపెద్ద సాగుభూమిలో ఒకటిగా పేరు గడించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం రూ.28లక్షలు పలుకుతోంది. భారత్-అమెరికాల మధ్య 50ఏళ్ల కిందటి కంట్రీ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం ద్వారా ఆ దేశంలోకి ఆయా పండ్ల విత్తనాలు తీసుకుని వచ్చారు. ఫ్లోరిడావ్యాప్తంగా విస్తరించి ఉన్న పలు నర్సరీల నుండి వీటిని సేకరించి అంట్లు కట్టి ఎకరానికి సగటున 300 మొక్కల చొప్పున హై డెన్సిటీ ఫార్మింగ్ చేస్తున్నారు. ఎకరానికి అన్ని ఖర్చులు కలుపుకుని రూ.30లక్షలు అవుతుందని, దానిలో 15శాతం లాభం వస్తుందని తెలిపారు. 25 మంది కూలీల సహకారంతో పండ్లను జాగ్రత్తగా చెట్టు నుండి వేరు చేస్తామని యంత్రాలతో సగం పని ఉంటుందని పేర్కొన్నారు. తాము పండించిన సరుకు మధ్యవర్తులు లేకుండా వాట్సాప్ ఆర్డర్ల ద్వారా అమెరికావ్యాప్తంగా రెండు రోజుల్లో సరఫరా చేస్తున్నామని, త్వరలో తమ పొలం వద్దనే ఒక దుకాణం తెరిచే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. వ్యవసాయ విద్యనభ్యసించే ఇరువురు విద్యార్థులు తమ ఉద్యోగులుగా పనిచేస్తూ...పొలాన్ని ప్రతిరోజు మొక్కలను పరీక్షిస్తారని పేర్కొన్నారు. ఏజీ5 వర్గీకరణ ద్వారా త్వరలో తమ ఫామ్‌ను విస్తరించే ప్రణాళికలో ఉన్నామని తెలిపారు. అమెరికాలో వ్యవసాయం తప్పనిసరిగా ఫామ్‌లో ఉండి చేస్తేనే లాభసాటిగా ఉంటుందని, ఎక్కడో పొలం కొని ఎవరికో వదిలేసి లాభాలు స్వీకరించాలంటే కుదరదని ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారికి సలహా ఇస్తున్నారు.

    Image

    * రైతు సహకార సమితి ఉంటుంది - దేశు గంగాధర్

    విజయవాడకు చెందిన దేశు గంగాధర్ ఆరిజోనాలోని బోవైలో 160ఎకరాల్లో పిస్తా పప్పు పండిస్తున్నారు. 3500 ఎకరాలకు చెందిన రైతులందరూ కలిసి సహకార సమితిగా (కో-ఆప్ ఫార్మింగ్) ఏర్పడ్డారు. ఇందులో సభ్యుడిగా ఉన్న ఆయన 2016 నుండి పిస్తా పప్పు సాగు చేస్తున్నారు. ఈ 3500ఎకరాల సమితి 15వేల ఎకరాలు కలిగిన మరో సమితిలో భాగంగా ఉంది. ఈ మొత్తం 15వేల ఎకరాల్లో 40మంది కార్మికులు మాత్రమే పనిచేస్తారని, 99శాతం యంత్రాలతోనే సాగు జరుగుతుందని వెల్లడించారు. 2008లో కృష్ణా జిల్లా గండేపల్లిలో ఈయన అల్లం, చెరుకు సాగు చేసిన అనుభవాన్ని అమెరికా తీసుకువచ్చారు. 8-12 ఏళ్ల మధ్య పిస్తా చెట్టు కాపుకు వస్తుంది. 8వ ఏట నుండి దిగుబడి రెండింతలు అవుతుంది. 13వ ఏట పతాక స్థాయిలో దిగుబడి వస్తుందని గంగాధర్ పేర్కొన్నారు. బాదం-పిస్తా సాగులో అమెరికా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. అత్యంత నాణ్యమైన టాప్ గ్రేడ్ పప్పును ఇజ్రాయెల్ కొనుగోలు చేస్తుంది. దాని తర్వాత మధ్యప్రాచ్య, యూరప్, చైనాలు కొనుగోలు చేస్తాయి. ట్రంప్ టారిఫ్‌ల కారణంగా అమెరికన్ రైతులకు ఎగుమతుల్లో గడ్డుకాలం నడుస్తోందని..తమ పప్పు ప్రాసెసింగ్ అంతా వారి ఫామ్‌లోనే సాగుతుందన్నారు. యంత్రాలతోనే పని సులభతరం అవుతుందని, సాటి అమెరికన్ రైతులతో కలిసి సహకార సమితి ద్వారా పంట అమ్ముకోవడం తేలికవుతుందన్నారు. ఎకరానికి రూ.2.5లక్షల పెట్టుబడికి 1800కిలోల పప్పు ద్వారా రూ.6.5లక్షల రాబడి ఉంటుందన్నారు. నీటి సమస్య, చీడపీడలు, చలికాలం వంటి సవాళ్లు సైతం అమెరికాలో కూడా ఉంటాయని గంగాధర్ అన్నారు. కో-ఆప్ ద్వారా ముందు రైతాంగ వ్యవస్థ మౌలిక సూత్రాలను ఔపోసన పట్టాక ఈ రంగంలోకి దిగితే ఆశాజనకంగా ఉంటుందనే సలహా ఇస్తున్నారు.

    Image

    * పురస్కార విజేతలు - సమీర్, దేవినేని రాజేష్, కాంతి కంఠమనేని

    విశాఖకు చెందిన సమీర్, గుంటూరుకు చెందిన రాజేష్, విజయవాడకు చెందిన కాంతిలు 2022లో ఎకరం రూ.11లక్షల చొప్పున డల్లాస్‌కు 2గంటల దూరంలోని డిలియోన్‌లో 333ఎకరాలు కొనుగోలు చేసి పీకాన్ పప్పు పండిస్తున్నారు. టెక్సాస్ పీకాన్ గ్రోయర్స్ అసోసియేషన్ నుండి 2025కు గానూ బెస్ట్ న్యూ గ్రోయర్ అవార్డును అందుకున్నారు. ఏప్రిల్‌లో ఎరువులు, నీటి సరఫరా అనంతరం సెప్టెంబరు నుండి దిగుబడి లభిస్తుందని తెలిపారు. పంటను హోల్‌సేలర్లకు అమ్ముతామని వారి నుండి చైనా, యూరప్‌లకు నాణ్యమైనది వెళ్లగా మిగిలినది కాస్కో లాంటి దుకాణాలకు వెళ్తుందని వివరించారు. 95% పని అంతా యంత్రాలతోనే జరుగుతుందని తెలిపారు. ఎకరాకు రూ.58వేల ఖర్చుతో అరటన్ను పీకాన్ పప్పు దిగుబడి సాధిస్తున్నామని..పెట్టుబడి-రాబడి ఖర్చులు సరిపోతాయని పేర్కొన్నారు. కలుపు మొక్కలను తినే గొర్రెలను పెంచుతున్నామన్నారు. ఉడతలు, కాకులు, జింకలు, అడవిపందులతో ఇబ్బందులు సహజమన్నారు. తక్షణ లాభాల కోసం వ్యవసాయం అనువైనదని కాదని, తరాల తరబడి విలువైన ఆస్తిగా నిలబడేందుకు భూమిపై పెట్టుబడి పెట్టవచ్చునని...అలాంటి పెట్టుబడుల ఖర్చు నిర్వహణకు వ్యవసాయాన్ని ఆధారం చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని సలహా ఇస్తున్నారు.

    Image

    * 600 ఎకరాలు. 3వేల గోవులు. రోజుకి 66వేల లీటర్లు. లీటరుకు రూ.18 - న్యూమెక్సికో గోశాల నిర్వాహకులు

    తెలంగాణాకు చెందిన భాగస్వామ్యులతో కలిసి న్యూమెక్సికో సమీపంలోని 600ఎకరాల్లో 3000 జెర్సీ ఆవులతో ప్రవాస తెలుగు రైతులు కొంతమంది భారీస్థాయిలో గోశాల నిర్వహిస్తున్నారు. 40మంది కూలీలను ఏర్పాటు చేసుకుని ఈ గోవుల నుండి రోజుకి రెండుసార్లు చొప్పున మొత్తంగా 66వేల లీటర్ల పాలను సేకరించి అమ్ముతున్నారు. ట్రంప్ టారిఫ్‌ల కారణంగా లీటరు రూ.18(20సెంట్లు)లకు అమ్ముతున్నారు. డీ-80 వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 160గోవుల నుండి 15నిముషాల్లో పాలు సేకరించి ఉష్ణోగ్రత నియంత్రిత ట్యాంకర్లోకి ఎక్కించి రవాణా చేస్తున్నారు. ఇటీవలే ప్రారంభించిన ఈ గోశాల పాడిసంపదను 12వేలకు, విస్తీర్ణాన్ని వేల ఎకరాలకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 600ఎకరాల్లో సగం విస్తీర్ణం గోశాలకు, ఇతర నిర్మాణాలకు పోగా మిగిలిన దానిలో దాణా గడ్డి సాగు చేస్తూ నీటి కోసం బావులను తవ్వారు. ఈ 300ఎకరాల గడ్డి 2నెలలు సరిపోతుందని, మిగతా దాణా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. బంగారం, చమురు లాగా పాలు కూడా ఫ్యూచర్స్ మార్కెట్ కోవలోకి వస్తుందని, దీనిలో కూడా ప్రతిరోజు హెచ్చుతగ్గులు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. గోవులన్నింటినీ ఐడహో, విస్కాన్సిన్, నెబ్రాస్కాతో పాటు అమెరికాలోని పలు రాష్ట్రాల నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

    Image

    Tags-NRI Telugus Agriculture And Real Estate In USA,telugus agriculture and real estate in usa,Telugu farming in USA,telugus agriculture usa,telugu fruits usa,indian fruits usa,gokhul krishna kilaru,andhrajyothy agriculture special items

    Image

    JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

    Featured Content

    Latest Articles