తెదేపాలో కేసీఆర్ కన్నా సీనియర్లు...ఎన్‌టీఆర్‌కు వీరాభిమానులు - డా. దగ్గుబాటి

Featured Image

కొంతకాలం క్రితం శ్రీపతి రాజేశ్వరరావు కాలం చేశారు. ఈ నెలలో ఎన్టీఆర్ రాజు, పిన్నమనేని సాయిబాబా చనిపోయారు. వీరు ఎన్టీఆర్ అభిమానులుగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్లల్లో పార్టీలో ప్రవేశించి చివరివరకు ఎన్టీఆర్ అభిమానులుగానే ఉన్నారు. శ్రీపతి రాజేశ్వరరావు మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ రాజు రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులయ్యారు. సాయిబాబా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. సాయిబాబా, శ్రీపతి రాజేశ్వరరావు హైదరాబాదులో ఉంటారు. ఎన్టీఆర్ రాజు తిరుమలలో ఉంటారు. వీళ్ళతో నా అనుబంధం 1982 నుంచి ఉన్నది.

---పిన్నమనేని సాయిబాబా

మొదట 1982 ఏప్రిల్ 11వ తేదీన తెలుగుదేశం పార్టీ మొదటి సభ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించినప్పుడు సాయిబాబా నాకు తారసపడ్డాడు. ఆ రోజు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి ఊరేగింపులో ప్రధాన పాత్ర వహించాడు. నాటి నుండి చనిపోయేంతవరకు కూడా పార్టీ ఆఫీసును అంటిపెట్టుకొని ఉంటూ నిత్యం పార్టీ ఆఫీసుకు వెళ్లి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవారు. చివరకు పార్టీ తెలంగాణలో ఉనికిని కోల్పోయి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు అందరూ ఆ పార్టీలోకి వెళ్లి శాసనసభ్యులుగా, మంత్రులుగా అవ్వడం జరిగింది. కేసీఆర్ కన్నా సీనియర్ అయిన సాయిబాబాను ఒకసారి కెసిఆర్ పిలిపించుకొని "సాయన్న నీవు కూడా మా పార్టీలోకి రా...నీకు మంచి పదవి ఇస్తాను" అని అన్నా కూడా వెళ్లకుండా ఎన్టీఆర్ అభిమానిగానే తెలుగుదేశం పార్టీకి అంకితం అయ్యాడు. సాయిబాబాకు కాలు లేకపోయినా అత్యంత చురుకైన వ్యక్తి. పార్టీకి సంబంధించిన స్లొగన్స్ గాని, ప్రతిపక్షంలో ఉద్యమాలు నిర్వహించినప్పుడు జనాలను సమీకరించడం కానీ మొత్తానికి కేంద్ర బిందువుగా ఉండేవారు. నా అభిప్రాయం ప్రకారం అయితే అతను పార్టీలో అత్యున్నతమైన పదవిలో ఉండవలసిన వ్యక్తి. కానీ ఏనాడు అతను నాకు ఈ పదవి కావాలి అని అడిగినట్లు నాకు గుర్తులేదు. చివరకు కార్యకర్తగానే మిగిలి నేడు దివంగతులు అయ్యారు.

---ఎన్టీఆర్ రాజు

ఎన్టీఆర్ రాజు తిరుమల నివాసి. అతని పేరు ఎన్టీఆర్ రాజు గానే గుర్తింపు పడ్డారు. 1982 మే 28వ తేదీన అంటే రెండవ సభ తిరుపతిలో నిర్వహించేటప్పుడు నేను ఆ సభ నిర్వహణ కోసం వారం రోజులు ముందే తిరుపతి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా 27వ తేదీ రాత్రి తిరుపతి వీధుల్లో పనుల ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తుండగా ఒక వ్యక్తి చొక్కా లేకుండా ఎన్టీఆర్ స్వాగతం ఆర్చ్ కు పూలు అలంకరిస్తూ నాకు కనపడ్డారు. ఎవరు మీరు అని నేను అతనిని అడగగా.. నా పేరు ఎన్టీఆర్ రాజు అని చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ రాజు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఎంత అనుబంధాన్ని పెనవేసుకున్నాడు అంటే ఎన్టీఆర్ కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమానికి రాజుకు ఆహ్వానం వెళ్ళేది. అన్ని కార్యక్రమాలకు రాజు హాజరయ్యేవారు. నేటికీ ఎన్టీఆర్ లేకపోయినా వారి కుమారులతో ప్రతి పండుగకు వచ్చి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తిరుపతి ప్రసాదాన్ని అందజేయడం ఆనవాయితీగా చేస్తూ ఉండేవారు. ఆ నేపథ్యంలోనే నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ లు ఎన్టీఆర్ రాజు పార్థివ దేహాన్ని భుజంపై మోస్తూ అంత్యక్రియలో పాల్గొన్నారు.

---శ్రీపతి రాజేశ్వరరావు

శ్రీపతి రాజేశ్వరరావు అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడిగా ఉండి మరణించారు. అతను జీవించి ఉన్నంత కాలం కూడా రామారావు గారి జయంతులు, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ హైదరాబాదులో హడావుడి చేస్తూ ఉండేవారు. ఇదేవిధంగా మరి ఎందరో అభిమానులు ప్రపంచవ్యాప్తంగా రామారావు గారికి ఉన్నారు. కానీ నాకు తెలిసి గుర్తింపు పొందినటువంటి అంకితభావంతో "అభిమాని" అనే పదానికి వీరు మారుపేరు. సినీ జగత్ లో ఉన్నవారికి ఎవరికైనా అభిమానులు ఉండి ఉండవచ్చు కానీ, ఇలాంటి వారు చాలా అరుదుగా కనపడుతుంటారు. ఈ సందర్భంగా నా ఆలోచన...... హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్.. అదే స్మృతి వనం వద్ద ఈ ముగ్గురు ప్రతిమలు వారి అనుబంధాన్ని తెలిపే విధంగా పెట్టడం సమంజసం అనేది నా భావన. రాబోయే రోజుల్లో ఆ ప్రయత్నం చేద్దాం. ఇది ఆ మహానీయునికి నిజమైన నివాళి అవుతుంది గదా!

Tags-DrDaggubati Venkateswararao Recalls His Memories With NTR Fans PinnamaneniSaibaba SripatiRajeswar NTRRaju

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles