భాష పోతే శ్వాస పోతుంది-సింగపూర్‌లో వెంకయ్య

Featured Image

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక కళాసారథి సంస్థ వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జరిగిందని గుర్తు చేసుకున్నారు. ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం నిరంతరం లభిస్తున్నాయని ధన్యవాదాలు తెలిపారు. సింగపూరులో భారత హైకమిషనర్ డా.శిల్పక్ అంబులే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. అందరూ ఐకమత్యంతో ఉండాలని కోరారు. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోటే అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు. సింగపూర్ వంటి దేశాలు మనవారిని ఆదరించి అవకాశాలు కల్పిస్తున్నాయని, ఏ దేశంలో ఉన్నా అక్కడి నిబంధనలను, పద్ధతులను గౌరవించాలని సూచించారు. మన సంస్కృతి, మన భాష, మన యాస, మన కట్టు, మన బొట్టు, మన సంప్రదాయాలను మరచిపోకూడదని... కుటుంబ వ్యవస్థే మన బలమన్నారు. పాశ్చాత్య సంస్కృతి, ఎలక్ట్రానిక్ పరికరాల వ్యామోహంలో పడి కుటుంబాన్ని విస్మరించవద్దని సూచించారు. ముఖ్యంగా పిల్లలు తమ అమ్మమ్మలు, తాతయ్యలతో సమయం గడపాలని, వారి నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. పెద్దలు కూడా పిల్లలతో తగినంత సమయం గడపాలని సూచించారు. భాష పోతే శ్వాస పోతుందని వెల్లడించారు. ప్రకృతితో మమేకమై జీవించాలని, సూర్యోదయానికే నిద్రలేవాలని, వ్యాయామం, యోగా చేయడం ద్వారా మనసు, శరీరం అదుపులో ఉంటాయని తెలిపారు. సిరిధాన్యాలు, సంప్రదాయ వంటకాలే మనకు బలమని, పిల్లలకు మన రుచులను అలవాటు చేయాలని సూచించారు. టీవీలకు అతుక్కుపోకుండా క్రీడలు, సంగీతం వంటి కళల్లో పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. సూర్యాస్తమయానికల్లా పనులు ముగించుకోవాలన్నారు. పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావని, అవి ఐక్యతకు గొప్ప వేదికలని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి వంటి వీరుల చరిత్రను నేటి తరానికి తెలియజేయాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్నికల ప్రక్రియను వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆఈ) వినియోగాన్ని ఆపలేమని, అయితే దాని దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక సంతోషానికి కొన్ని కఠిన నిబంధనలు, నియంత్రణలు అవసరమని అందుకే సింగపూర్ తనకు నచ్చుతుందని అన్నారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిహుద్లు వెంకయ్యను ఘనంగా సన్మానించారు. కొత్తమాస్ వెంకటేశ్వరరావు, హనుమంతరావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్, గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణకాంతి, సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు, సుబ్బు వి. పాలకుర్తి, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి, మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల, సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు.

Tags-Mother Tongue Is Important Says Ex VP Venkaiah Naidu In Singapore

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles