మేరీల్యాండ్‌లో సికింద్రాబాద్ యువతి హత్య

Featured Image

అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికిత గొడిశాల అనే యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె తన ఒకప్పటి మిత్రుడి అపార్టుమెంటులో విగత జీవిగా పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. అయితే అంతకుముందే అతడు దేశం విడిచి పారిపోయాడు. పారిపోవడానికి ముందు అతడే నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్త సంవత్సర వేడుకల తర్వాతి నుంచి ఆమె కనిపించలేదు. దీంతో అర్జున్‌ శర్మ అనే 26 ఏళ్ల యువకుడు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను చివరిసారిగా ఆమెను ఎల్లికాట్‌ సిటీలో డిసెంబరు 31వ తేదీన చూశానని చెప్పాడు. అది అతడు ఉంటున్న అపార్టుమెంటే. అయితే జనవరి 2వ తేదీన అతడు భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సెర్చ్‌ వారెంటు జారీ చేసిన అధికారులు.. అతడి అపార్టుమెంటును తనిఖీ చేయగా నికిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయి. విచారణ జరపగా.. నికితను డిసెంబరు 31వ తేదీ రాత్రి 7.30 గంటల తర్వాత అర్జున్‌ చంపేసినట్లు తేలింది. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. భారత్‌కు పరారైన అర్జున్‌ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్‌ అధికారుల సాయం కోరారు. మరోవైపు నికిత స్నేహితులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆమె ఫొటోను సోషల్‌ మీడియాలో ఉంచారు. ఆమె హత్యకు గురైందని ఆదివారం వెల్లడి కావడంతో విషాదంలో మునిగిపోయారు. నికిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్‌లో ఉన్నట్లు ఆమె సోషల్‌ మీడియా ఖాతాల ఆధారంగా తెలుస్తోంది. అయితే, ఆమె భారత్‌లో ఏ ప్రాంతానికి చెందిన యువతి అనే విషయాన్ని అధికారులు కచ్చితంగా ప్రకటించలేదు.

Tags-Nikitha Godisala Murdered In Maryland

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles