లినక్స్ ప్రపంచంలో తెలుగు వెలుగు.. షువా ఖాన్

Featured Image

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాఫ్ట్‌వేర్.."లినక్స్". ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు, ఏటీఎంలు, అంతరిక్ష నౌకలు, స్టాక్ ఎక్స్‌ఛేంజీలు, డేటా సెంటర్లు, ప్రపంచవ్యాప్త సూపర్‌కంప్యూటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ఐబీఎం, అమెజాన్, గూగుల్, ఎన్వీడియా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, క్వాల్‌కాం, మెటా అన్నీ లినక్స్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ అద్భుతమైన ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్ రూపకల్పన, నిర్వహణలో లినక్స్ ఫౌండేషన్ ఫెలోగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు మహిళ షువా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి ఆసియా మహిళగా, తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు.

కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో కలిసి లినక్స్ సాఫ్ట్‌వేర్ పనిచేయడానికి లినక్స్ కర్నెల్ అవసరం. ఇది మొత్తం సిస్టమ్‌కు మూలాధారం. 3.5కోట్ల లైన్ల కోడ్ కలిగిన ఈ కర్నెల్ భద్రత, నిర్వహణ వంటి వాటిని సహచర సభ్యులు లినక్స్ సృష్టికర్త లైనస్ టోర్వాల్డ్స్, మరో కర్నెల్ డెవలపర్ గ్రెగ్ క్రోహ్-హార్ట్‌మన్‌తో కలిసి షువా పర్యవేక్షిస్తున్నారు. కర్నెల్ అభివృద్ధిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్ నుండి వచ్చే నూతన కోడ్‌ను సమీక్షించి, ఆమోదించే కీలక ప్రక్రియను ఆమె సమన్వయపరుస్తున్నారు. ఈ బృందంలో సభ్యత్వం సాధించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమెతో "TNILIVE" ప్రత్యేక కథనం.

* ఏమిటీ లినక్స్ ఫౌండేషన్?

లినక్స్‌ను నడిపించే లినక్స్ కర్నెల్ నిర్వహణ సున్నితమైన, భద్రతాపరమైన అంశాలతో ముడిపడింది. కర్నెల్ కోడ్‌లో చిన్న పొరపాటు పెనుముప్పుకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని నిర్వహణ, భద్రత కేవలం ముగ్గురు చేతుల్లో మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లతో పాటు, తమ వాణిజ్య ప్రయోజనాల అవసరాల మేరకు కంపెనీలు సమర్పించే కర్నెల్ కోడ్ అప్‌డేట్స్‌ను సమీక్షించడంతో పాటు లినక్స్‌పై ఆధారపడే వారందరికీ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను ఈ త్రిసభ్య బృందం పర్యవేక్షిస్తుంది. ఈ ముగ్గురు డెవలపర్ల బృందానికి జీతభత్యాలు, చట్టపరమైన రక్షణ కల్పించే నిమిత్తం లినక్స్ ఫౌండేషన్ పురుడు పోసుకుంది. ఈ త్రిసభ్య బృందాన్నిలినక్స్ ఫౌండేషన్ ఫెలోలుగా పిలుస్తారు. లినక్స్ నుండి లబ్ధి పొందే దిగ్గజ సంస్థలు ఈ ఫౌండేషన్‌లో సభ్యులుగా జేరి కర్నెల్ అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడంతో పాటు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంటారు. తద్వారా లినక్స్ కర్నెల్‌పై గుత్తాధిపత్యానికి తావు లేకుండా కేవలం దాని అభివృద్ధి, భద్రతను సమీక్షించే వనరులను మాత్రమే కల్పిస్తారు. అంటే అటు కర్నెల్ డెవలపర్స్‌కు, ఇటు కార్పొరేట్ సంస్థలకు మధ్యవర్తిగా లినక్స్ ఫౌండేషన్ వ్యవహరిస్తుంది. అయినప్పటికీ కర్నెల్ వ్యవహారాల్లో ఈ ఫౌండేషన్ జోక్యం చేసుకోదు.

లినక్స్ ఫౌండేషన్ ఫెలో..ఒపెన్-సోర్స్ ప్రపంచంలో లభించే అత్యున్నత గౌరవం. ఓపెన్-సోర్స్ కమ్యూనిటీలో దీర్ఘకాలంగా సేవలందించడం, విలువైన సాఫ్ట్‌వేర్ కోడ్ అందించడం, నాయకత్వం వంటి వాటికి గుర్తింపుగా ఈ సభ్యత్వం లభిస్తుంది. 1991లో మొదలైన లినక్స్ ప్రయాణంలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఈ ఫెలో హోదా పొందారంటే దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఈ ముగ్గురూ లినక్స్ ఫౌండేషన్ ద్వారా నేరుగా లినక్స్ కర్నెల్ అభివృద్ధికి పూర్తి సమయం కృషి చేస్తున్నారు. లినక్స్ ఫౌండేషన్ ఫెలోలో తొలి మహిళగా, తొలి ఆసియా మహిళగా, అంతకు మించి తొలి తెలుగు మహిళగా షువా ఖాన్ ఘనత సాధించారు.

* నేపథ్యం

షువా ఖాన్ స్వస్థలం ఒంగోలు. ఆమె తండ్రి ప్రభుత్వ పశు వైద్యాధికారి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా కుటుంబం రాష్ట్రమంతటా తిరిగింది. మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, బాపట్లలోని ఏబీఎం, సరస్వతీ మెమోరియల్ పాఠశాలల్లో చదువుకున్నారు. 1979లో మోదుకూరులో పదవతరగతి పూర్తి చేశారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్, తర్వాత 1985లో ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. తాను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని ఎదిగానని షువా గర్వంగా చెప్పుకుంటారు.

భారత్‌లో కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత 1988లో అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1990లో బే ఏరియాలో తొలి ఉద్యోగం అనంతరం 1993లో లూసెంట్ ఎటీ అండ్ టీ బెల్ ల్యాబ్స్‌లో పని చేశాక 1999 నుంచి 2013 వరకు హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ)లో 13 సంవత్సరాలు సేవలందించారు. హెచ్‌పీలో పని చేసే సమయంలోనే ఆమెకు లినక్స్‌తో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడింది. హెచ్‌పీ హార్డ్‌వేర్‌ను లినక్స్‌తో అనుసంధానించే ప్రాజెక్టులో లినక్స్ డెవలపర్లకు నేరుగా సహకరించే అవకాశం వచ్చింది. 2007లో ఓపెన్ సోర్స్ రంగంలోకి అడుగుపెట్టారు. 2011 నుంచి పూర్తి సమయం స్వతంత్ర లినక్స్ కంట్రిబ్యూటర్‌గా మారారు. 2013 నుంచి 2018 వరకు శాంసంగ్‌లో పని చేశారు. లినక్స్ ఫౌండేషన్ సాంకేతిక సలహాదారుల మండలి చొరవతో ప్రారంభించిన "కె-సెల్ఫ్‌టెస్ట్"(kselftest) నిర్వాహకురాలిగా 2014లో ఆమె ఫౌండేషన్ సభ్యురాలిగా చేరారు.

* లినక్స్ ఫౌండేషన్ ఫెలోగా బాధ్యతలు

షువా ఖాన్ ప్రస్తుతం లినక్స్ ఫౌండేషన్ ఫెలోగా 2019 నుంచి లినక్స్ కర్నెల్ నాణ్యతను కాపాడే బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆమె లినక్స్ కర్నెల్ మెయింటెయినర్‌గా వ్యవహరిస్తూ, కర్నెల్ సెల్ఫ్ టెస్ట్ ఫ్రేమ్‌వర్క్(kselftest), క్లౌడ్ కంప్యూటింగ్‌లో విస్తారంగా ఉపయోగపడే యూఎస్బీ ఓవర్ ఐపీ డ్రైవర్ వంటి కీలక సబ్ సిస్టమ్‌లను పర్యవేక్షిస్తున్నారు. డెవలపర్లు తమ మార్పుల వల్ల కర్నెల్‌కు ఎలాంటి నష్టం జరగదని నిర్ధారించుకునేందుకు వీలు కల్పించే "కె-సెల్ఫ్‌టెస్ట్"(kselftest) రూపొందించడంలో, ఆండ్రాయిడ్ డ్రైవర్లను మెయిన్‌లైన్ లినక్స్‌లో విలీనం చేసే ప్రయత్నాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. వీటి ఆధారంగా, ఓపెన్-సోర్స్ కమ్యునిటీలో సేవల ఆధారంగా ఆమెను లినక్స్ ఫౌండేషన్ ఫెలోగా ఎంపిక చేశారు.

రోజువారీ పనిలో భాగంగా డెవలపర్లు రాసిన కోడ్‌ను సమీక్షించడం, అది ఇప్పటికే ఉన్న సిస్టమ్‌తో సరిగ్గా కలుస్తుందా? దాని వల్ల కర్నెల్ పాడవుతుందా? నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదా? వంటి అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటానని.. ఇది ఒక సాంకేతిక న్యాయమూర్తి వంటి పాత్ర అని పేర్కొన్నారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు, యువ డెవలపర్లను తీర్చిదిద్దడంలో షువా శ్రద్ధ చూపిస్తున్నారు. "లినక్స్ ఫౌండేషన్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్"ను స్థాపించి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది కొత్త డెవలపర్లను కర్నెల్ అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. 2025 నాటికి ఆమె వందలాది విద్యార్థులు, డెవలపర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ మెంటర్‌షిప్‌లో భాగం కావాలంటే తప్పనిసరిగా లినక్స్ కర్నెల్‌కు 5 నుంచి 10 ప్యాచ్‌లను సమర్పించి ఉండాలి. ఈ ప్రోగ్రాంలో రిమోట్‌గా పాల్గొనే అవకాశం ఉంటుంది. స్టైఫండ్ కూడా అందజేస్తారు. మహిళలు కర్నెల్ కమ్యూనిటీలో మరింత కీలకంగా వ్యవహరించేలా ఆమె చొరవ తీసుకుంటున్నారు.

మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో తన అనుభవాల గురించి మాట్లాడుతూ – కొందరు విద్యార్థులు కృత్రిమ మేథ ద్వారా తయారు చేసిన కోడ్‌ను సమర్పిస్తున్నారు. కానీ కోడ్ సమీక్ష సమయంలో దాని వెనుక ఉన్న అసలైన ఆలోచన, అవగాహన విద్యార్థుల్లో కొరవడుతోందని తెలిపారు. అందుకే ముందు మౌలిక అంశాలను లోతుగా అధ్యయనం చేశాక అవసరమైన సాంకేతిక సహాయాన్ని వినియోగించాలని సూచిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో తార్కిక, సృజనాత్మక అంశాలు రెండూ కలిసి ఉంటాయని, ఓపెన్-సోర్స్ రంగం తనకు స్వేచ్ఛ ఇచ్చిందని షువా అన్నారు. కార్పోరేట్ సంస్థల్లో వారి వాణిజ్య అవసరాల దృష్ట్యా పనిచేయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం ప్రపంచమంతటా ఉన్న డెవలపర్లతో సమన్వయం చేయడం, వారికి సహకరించడం, మెంటార్లుగా పని చేయడం వంటివి తనను ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు.

* కృత్రిమ మేథపై..

కృత్రిమ మేథపై షువా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓపెన్ సోర్స్ లేకుండా ఏఐ లేదన్నారు. ఎన్విడియా వంటి సంస్థలు ఓపెన్ సోర్స్‌పై ఆధారపడి ఏఐ వ్యవస్థలు నిర్మిస్తున్నాయి. కానీ ఏఐను నడిపే మోడళ్లు (LLMలు) మాత్రం కొందరి గుప్పిట ఉండటం ఆందోళనకరమన్నారు. వీటిని ఓపెన్-సోర్స్‌గా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేయవల్సిన అవసరం ఉందన్నారు. పది సంవత్సరాల క్రితమే లినక్స్ కమ్యూనిటీ ఏఐ ద్వారా స్వయంచాలితంగా కర్నెల్ సమస్యలు గుర్తించే పద్ధతులు ప్రయోగించిందని షువా పేర్కొన్నారు. ఏఐ ఒక మాయాదండం కాదని, సమీకృత సహకారం లేకుండా దేన్నీ సాధించలేరని ఆమె స్పష్టం చేశారు. ఏఐ మోడళ్లల్లో నిష్పక్షపాతానికి పెద్దపీట వేయాలని, దీన్ని సాధించే సత్తా కేవలం ఓపెన్-సోర్స్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. తన కోడ్ రివ్యూలకు ఏఐని వినియోగించట్లేదని ఆమె తెలిపారు. ఏఐ ఫలాలు అందరికీ అందుబాటులోకి రావల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

* ఆత్మ సంతృప్తే నిజమైన విజయం

"సమాజం ఆశించేది చేయడానికి పరిగెత్తకండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ కలలు తెలుసుకోండి. మీ బలాలు, బలహీనతలు గుర్తించండి. మీకు ఆనందం ఇచ్చే పని ఎంచుకోండి. ఆత్మ సంతృప్తి లేకుండా ఏ విజయమూ నిలవదని" షువా అన్నారు. లినక్స్ కర్నెల్ వంటి సాంకేతికంగా కఠినమైన రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అక్కడి నుంచి గవర్నెన్స్ స్థాయికి ఎదగడం, ఓపెన్ సోర్స్ విలువలను కాపాడే ప్రయత్నం చేయడం, గ్లోబల్ టెక్ గవర్నెన్స్‌లో కీలక పాత్ర పోషించడం వంటివి ఆమెకు ప్రపంచవ్యాప్త గురింపును ఆర్జించాయి.

Tags-TNILIVE Special Interview With The First And Only Female Linux Foundation Fellow Shuah Khan From Ongole Andhra Pradesh

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles