సరికొత్త నాట్స్‌ను చూస్తారు - బోర్డు ఛైర్మన్ నందకిషోర్

Featured Image

* డల్లాస్‌లో 2027 సంబరాలు

* ప్రవాసులతో వేడుకగా కార్యవర్గ సమావేశం

* ఛైర్మన్ కిషోర్‌కు సన్మానం

16 ఏళ్ల కిందట ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీను(నాట్స్) బలోపేతంగా, శాఖలు విస్తరించుకుని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సరికొత్తగా తెలుగువారి సేవకు సిద్ధంగా ఉండేలా, తెలుగు భాష-సంస్కృతికి పట్టం కట్టేలా తయారు చేసేందుకు తన హయాంలో కృషి చేస్తానని ఆ సంస్థ బోర్డు ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ రిమ్మనపూడికి చెందిన ప్రవాసాంధ్రుడు కంచర్ల నందకిషోర్ అన్నారు. శనివారం నాడు గ్రేప్‌వైన్‌లో నాట్స్ 2026-27 కార్యవర్గం స్థానిక ప్రవాసాంధ్రులతో మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటు చేసింది. ఇందులో ఆయన ప్రసంగించారు. ఎక్కడో మారుమూల నుండి అమెరికాకు వచ్చిన తనకు మూలాల విలువ తెలుసునని అన్నారు. తన విజయాల వెనుక కుటుంబం పాత్ర వెలకట్టలేనిదని వెల్లడించారు.

2013, 2019లలో డల్లాస్‌లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు జరుపుకున్నామని..తిరిగి 2027లో డల్లాస్ ఈ సంబరాలకు వేదికగా మారడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ఆయన్ను సతీష్ రెడ్డి(ఆటా), అజయ్ రెడ్డి(టీపాడ్), మాధవి లోకిరెడ్డి(టాంటెక్స్), డా. తోటకూర ప్రసాద్(తానా), రవి గుళ్లపల్లి, పెమ్మసాని రవిలు కలిసి సత్కరించి అభినందనలు తెలిపారు. బావర్చి(ఫుడ్), పినాకిల్(గ్రానైట్), అక్రొన్స్(రియల్ ఎస్టేట్), కె.ఎన్.కె(ఇన్వెస్ట్‌మెంట్స్), నెక్సిలో(హెల్త్ కేర్) వంటి రంగాల్లో ఆయన విజయాలను కొనియాడారు. నాట్స్ కార్యక్రమాలకు తమ సంఘీభావాన్ని తెలిపారు.

అమెరికావ్యాప్తంగా ఉన్న నాట్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో..అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ ఇప్పటివరకు 28రాష్ట్రాల్లో విభాగాలు ఉన్న నాట్స్‌ను త్వరలో 50రాష్ట్రాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. సలహామండలి సభ్యుడు డా. కొత్తా శేఖరం మాట్లాడుతూ ఇండియా-అమెరికాలోని తెలుగువారికి సేవ చేయాలనే సదుద్దేశంతో మాదాల రవి, నాదెళ్ల రణకుమార్ తదితరులు నాట్స్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నాట్స్ అంటే కిందిస్థాయిలో చేసే ప్రాయోజకరమైన పనులను దేశవ్యాప్తంగా అమలు చేసే నాణ్యమైన సైన్యం కలిగిన సంస్థ అని కొనియాడారు. కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేని ఏకైక సంస్థ నాట్స్ అని పేర్కొన్నారు.

ఫ్రిస్కో మేయర్ పదవికి పోటీలో ఉన్న మార్క్ హిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు ప్రవాస ప్రముఖులకు సేవా పురస్కారాలు అందజేశారు. శనివారం ఉదయం నిర్వహించిన బోర్డు సమావేశంలో పలు కమిటీలను ఏర్పాటు చేసి తదుపరి లక్ష్యాలపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం కిషోర్ గృహంలో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరనాథ్ బుంగతావుల, రాజ్ అల్లాడ, పాములపాటి మదన్, అన్నే విజయశేఖర్, రాజేష్ కండ్రు, సుధీర్ మిక్కిలినేని, గోవాడ అజయ్, యలమంచిలి బిందు, మురళీ మేడిచెర్ల, ప్రేమ్ కలిదిండి, విజయ్ కట్టా, భాను లంకా, ఆది గెల్లి, బర్రి కృష్ణకాంత్, తుమ్మలపెంట శ్రీనివాస్, అను కొత్తా, విజయ్ కొండా, శేషు మారంరెడ్డి, ధూళిపాళ్ల భానుప్రకాష్, కిషోర్ నారె, అమర్ అన్నే, మండువ సురేష్-సతీష్, వెన్నం మురళీ, సుబ్బు జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు రాజలక్ష్మి చిలుకూరు, రాజేష్ అడుసుమిల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags-NATS 2026 Meet and Greet In Grapevine - Kishore Kancharla Takes Charge As Chairman

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles