🕑 Published: March 16, 2026 at 03:13 PM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఐయోవాలోని హియావత పబ్లిక్ లైబ్రరీలో అడ్వెంచర్స్ అన్వేల్డ్ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించింది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకునే సాహస యాత్రికులకు మార్గనిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఐయోవా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాట్స్ ఐయోవా విభాగం చేపట్టిన ఈ సదస్సులో స్థానిక సాహస దంపతులు పాడి-అనిత తాము విజయవంతంగా పూర్తి చేసిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, మౌంట్ కిలిమంజారో యాత్రలకు సంబంధించిన అనుభవాలను ఈ వేదికపై పంచుకున్నారు.
పర్వతారోహణకు అవసరమైన సన్నద్ధత, ఎదురయ్యే సవాళ్లు, ఆచరణాత్మక చిట్కాలను వీరు వివరించారు. నాట్స్ సలహా మండలి సభ్యులు జ్యోతి ఆకురాతి సంస్థ సేవా కార్యక్రమాలను, హెల్ప్‌లైన్ విశేషాలను వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ ఐయోవా చాప్టర్ టీం జాయింట్ కో ఆర్డినేటర్ నవీన్ ఇంటూరి, సభ్యులు గిరీష్ కంచర్ల, సింధు మన్వాడి, కృష్ణ మంగళమూరి, వంశీ నెల్లుట్ల తదితరులు సహకరించారు. అయోవా నాట్స్ విభాగాన్ని చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.




