🕑 Published: March 19, 2026 at 10:44 AM CST
మేష రాశి: ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యం 2, అవమానం 4
పరాభవ నామ సంవత్సరం మేష రాశి వారికి 70% అనుకూలంగా ఉంది. సంవత్సర ప్రారంభంలో ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ, జూన్ మాసం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఉన్నతాధికారుల మద్దతు, ఇంక్రెమెంట్లు, ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫార్మా, ఎగుమతి, దిగుమతి రంగాల వారికి సంవత్సరం ద్వితీయార్ధం నుండి అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా ఆదాయం పెరిగినా, కుటుంబ అవసరాలు లేదా ఆస్తి తగాదాల వల్ల ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. రాహువు అనుగ్రహంతో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కష్టపడి చదివి మంచి ఫలితాలు తెచ్చుకుంటారు. విదేశీ యత్నాలు చేసే వారికి ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తినా, పరస్పర అవగాహనతో సర్దుకుపోతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. స్త్రీలకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలించి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
వృషభ రాశి: ఆదాయం 5, వ్యయం 14 | రాజపూజ్యం 5, అవమానం 4
ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురు, రాహు, శనీశ్వరుల ప్రభావంతో అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. సీనియర్ ఉద్యోగస్తులకు పదోన్నతులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు పనులు చేసేవారికి భారీ లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా ఆదాయం బాగున్నా, వ్యయం అధికంగా ఉండటం వల్ల పొదుపుపై దృష్టి పెట్టాలి. గృహ నిర్మాణ పనులు, భూముల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు జూన్ తర్వాత చదువుపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబంలో కుజ ప్రభావం వల్ల చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన విశ్రాంతి తీసుకోవాలి. స్త్రీలకు ఈ ఏడాది 80% అనుకూలత కనిపిస్తోంది.
మిథున రాశి: ఆదాయం: 8 వ్యయం: 11 | రాజ్యపూజ్యం: 1 అవమానం: 7
మిధున రాశి వారికి ఈ సంవత్సరం 75 శాతం అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. దశమ శని ప్రభావంతో ఉద్యోగులు కష్టానికి తగిన గుర్తింపు, కొత్త బాధ్యతలు పొందుతారు. నిరుద్యోగులకు మాత్రం కొంత నిరీక్షణ తప్పదు. రియల్ ఎస్టేట్, కిరాణా, ఫ్యాన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది, కానీ అత్యాశతో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆర్థిక స్థితి మెరుగుపడి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, ప్రేమికులకు వివాహ యోగం ఉంది. విదేశీ ప్రయత్నాల్లో మధ్యవర్తులను నమ్మి డబ్బు నష్టపోకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య పరంగా నడుము, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. స్త్రీలకు వివాహ, ఉద్యోగ యోగాలు ఉన్నాయి, అయితే ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి: ఆదాయం 2, వ్యయం 11 | రాజపూజ్యం 4, అవమానం 7
ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జూన్ వరకు పరిస్థితులు సామాన్యంగా ఉన్నా, ఆ తర్వాత గురు గ్రహ సంచార మార్పుతో శుభ ఫలితాలు మొదలవుతాయి. ఉద్యోగంలో జూన్ 2 తరువాత చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రెమెంట్లు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. కాంట్రాక్టర్లకు కూడా పెండింగులో ఉన్న బిల్లులు మంజూరయ్యి, కొత్త వర్కులు చేతికొస్తాయి. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా అవసరానికి డబ్బు అందుతుంది. జూన్ తర్వాత వాహన, భూమి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే కఠిన శ్రమ తప్పదు. కుటుంబంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. విదేశీ ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం విషయంలో మధ్య వయస్కులు జాగ్రత్త వహించాలి. స్త్రీలకు బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు.
సింహ రాశి: ఆదాయం 5, వ్యయం 5 | రాజపూజ్యం 7, అవమానం 7
మీకు ఈ సంవత్సరం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు లోపు పదోన్నతులు, గుర్తింపు లభిస్తాయి, ఆ తర్వాత పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీడియా, సినీ రంగాల్లో పని చేసేవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం, అయితే రహస్యాలు ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ఆర్థికంగా ట్రాన్స్‌పోర్ట్, హార్డ్‌వేర్ రంగాల వారికి లాభాలు ఉన్నా, అనూహ్య ఖర్చులు కూడా ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ వీసాల కోసం ప్రయత్నాలు చేసే వారికి డిసెంబర్ తర్వాత సానుకూల వార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. స్త్రీలకు కళ్యాణ యోగం కలుగుతుంది.
కన్యా రాశి: ఆదాయం 8, వ్యయం 11 | రాజపూజ్యం 3, అవమానం 3
వారికి పరాభవ నామ సంవత్సరంలో 75% అనుకూలత ఉంది. గురుబలం వల్ల ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత హోదాలు, గుర్తింపు లభిస్తాయి. వ్యాపార రంగంలో అంచనాలకు మించిన ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది, ముఖ్యంగా ఎగుమతులు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి విపరీతమైన లాభాలు వస్తాయి. ఆదాయం పెరగడంతో పాటు బంగారం, ఆస్తుల కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు, ముఖ్యంగా టెక్నాలజీ రంగంపై ఆసక్తి చూపుతారు. కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది, భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉన్నందున ఓర్పు అవసరం. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి డిసెంబర్ వరకు కాలం అనుకూలంగా ఉంది. స్త్రీలు అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే అన్ని రంగాల్లోనూ స్తీలు ఈ ఏడాది ముందంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తులా రాశి: ఆదాయం 5, వ్యయం 14 | రాజపూజ్యం 6, అవమానం 3
ఈ రాశి వారికి ఈ సంవత్సరం 76% శుభ ఫలితాలు ఉన్నాయి. సంవత్సర ప్రారంభంలో గురుబలం వల్ల ఉద్యోగులకు పదోన్నతులు ఉన్నా, జూన్ తర్వాత పని ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ, మీడియా రంగాల్లో ఉన్నవారికి ప్రజాదరణ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారపరంగా ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ రంగాల వారికి తొలి మూడు నెలలు లాభసాటిగా ఉంటుంది. ఆర్థికంగా భారీ ఖర్చులు ఉన్నా అవి శుభ కార్యాలకు లేదా గృహ నిర్మాణాలు వంటి వాటికి సంబంధించనవిగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు పొందుతారు. విదేశీ యానం, గ్రీన్ కార్డు ప్రయత్నాలు చేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది. శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆహార నియమాలు పాటించాలి. స్త్రీలకు వివాహ యోగం ఉంది, కానీ స్పెక్యులేషన్ల జోలికి వెళ్లకపోవడం మంచిది.
వృశ్చిక రాశి: ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యం 2, అవమానం 6
వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జూన్ తర్వాత ఉద్యోగంలో పదోన్నతులు, అధికారుల మద్దతుతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలో అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారంలా మారుతుంది; అన్ని రంగాల వ్యాపారులు భారీ లాభాలు గడిస్తారు. ఆదాయం అద్భుతంగా ఉండటంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాకుండా వజ్రాభరణాలు, వాహనాల కొనుగోలు చేస్తారు. విద్యార్థులు జూన్ తర్వాత పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబంలో అన్యోన్యత పెరిగి శుభకార్యాలు జరుగుతాయి, అయితే సంతాన ఆరోగ్యంపై కొంత ఆందోళన ఉండవచ్చు. విదేశీ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే సఫలమవుతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. స్త్రీలకు పని ఒత్తిడి ఉన్నా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయడం ముఖ్యం.
ధనుస్సు రాశి: ఆదాయం 14, వ్యయం 11 | రాజపూజ్యం 5, అవమానం 6
మీకు ఈ పరాభవ నామ సంవత్సరంలో 73% అనుకూల ఫలితాలు ఉన్నాయి, అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జాగ్రత్త అవసరం. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినా, పనివారితో ఇబ్బందులు లేదా తొందరపాటు పెట్టుబడుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి; ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, టీచింగ్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరిగినా విలాసాలకు ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, కానీ ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలకు డిసెంబర్ వరకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో జీర్ణకోశ, వెన్ను సమస్యల పట్ల అప్రమత్తత అవసరం. కుటుంబంలో సోదర వర్గంతో వివాదాలు రావచ్చు, కాబట్టి మాట తీరుపై నియంత్రణ ఉండాలి. స్త్రీలకు వివాహ యోగం, కెరీర్ పురోగతి కనిపిస్తున్నాయి.
మకర రాశి: ఆదాయం 2, వ్యయం 8 | రాజపూజ్యం 1, అవమానం 6
గత కొన్నేళ్లుగా పడుతున్న ఇబ్బందుల నుండి ఈ ఏడాది బయటపడతారు. జూన్ తర్వాత గురు సంచారం వల్ల జీవితంలో కీలక మార్పులు వస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగాలు మారాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఒకేసారి పలు ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది, పాత అప్పులు తీరుస్తారు. గృహ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి, పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి మూడవ వ్యక్తిని జోక్యం చేసుకోనివ్వవద్దు. విదేశీ వీసాలు, ప్లేస్‌మెంట్లు సులభంగా లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్త్రీలకు ఆర్థిక స్థిరత్వం, ఆభరణాల కొనుగోలు యోగం ఉంది; సెప్టెంబర్ తర్వాత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభ రాశి: ఆదాయం 2, వ్యయం 8 | రాజపూజ్యం 4, అవమానం 2
పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని చివరి దశ ప్రభావంతో కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, బాధ్యతలు పెరిగినా ఆశించిన గుర్తింపు వెంటనే లభించకపోవచ్చు; అయితే జూన్ వరకు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు పోటీ పెరగడం వల్ల లాభాలు తగ్గవచ్చు, కానీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ మరియు స్టూడియో రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఆర్థికంగా ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది; అనవసర ఖర్చులు తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు కష్టపడితే ఉన్నత విద్యలో రాణిస్తారు. కుటుంబంలో తోబుట్టువులతో విభేదాలు రాకుండా ఓర్పు వహించాలి. ప్రేమ వివాహాలకు పెద్దల మద్దతు లభించడం కష్టంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు వివాహ యోగం ఉంది, చిన్న తరహా పెట్టుబడులు వీరికి కలిసి వస్తాయి.
మీనా రాశి: ఆదాయం 14, వ్యయం 11 | రాజపూజ్యం 7, అవమానం 2
పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మ శని ప్రభావం వల్ల ఉద్యోగులకు పని ఒత్తిడి, బద్ధకం పెరిగే అవకాశం ఉంది; క్రమశిక్షణతో పని చేస్తేనే ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఆర్థిక లాభాలు బాగున్నా, పనివారితో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎగుమతి వ్యాపారులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ, చేతికి అందాల్సిన డబ్బు ఆలస్యం కావడం లేదా ప్రణాళికలు మారడం వంటివి జరగవచ్చు. విద్యార్థులు కష్టపడితేనే ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించగలరు. కుటుంబంలో భాగస్వామితో పంతాలకు పోకుండా ఉండటం శ్రేయస్కరం. ప్రేమ వివాహాలకు మాత్రం సానుకూలత ఉంది. రాహువు అనుకూలత వల్ల విదేశీ వీసాలు, గ్రీన్ కార్డు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై, ముఖ్యంగా మానసిక ఒత్తిడిపై స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
