🕑 Published: March 23, 2026 at 09:34 AM CST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) 21వ వార్షికోత్సవంతో పాటు ఉగాది వేడుకలు శనివారం నాడు పశ్చిమ లండన్‌లోని SKLPC నార్త్ హాల్ట్లో వైభవంగా నిర్వహించారు. UK నలుమూలల నుంచి వందలాది తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెండు దశాబ్దాలుగా తెలుగు సంస్కృతి, భాష, సమాజసేవను యూకేలో ప్రోత్సహిస్తున్న TAL ప్రయాణాన్ని ఈ వేడుక ప్రతిబింబించింది. TAL కల్చరల్ సెంటర్ల (TCC) విద్యార్థుల ప్రదర్శనలు యూకేలో తెలుగు కళల వైభవాన్ని చాటిచెప్పాయి. ముఖ్య అతిథిగా ఎంపీ సీమా మాల్హోత్రా పాల్గొని TAL సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఛైర్మన్ రవి సబ్బా మాట్లాడుతూ ఉగాది మన సాంస్కృతిక మూలాలనే గాక భవిష్యత్ తరాలకు ఆ పరంపరను అందించే బాధ్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. కన్వీనర్ వాసు మేరెడ్డి ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు.
లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును లార్డ్ నాగరాజు(ఉదయ్ నాగరాజు)కి అందించారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఆయన నియామకంతో పాటు కృత్రిమ మేధస్సు రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రదానం చేశారు. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ప్రత్యేక సంగీత విభావరి అలరించింది. ఆయన సంగీత సేవకు గానూ కల్చరల్ ఎక్సెలెన్స్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జానపద కళాకారులు రెలరే గంగా, నల్గొండ గద్దర్ – కాసాల నర్సన్నల జానపద ప్రదర్శన ఆకట్టుకుంది. గాయకులు అఖిల్ చంద్ర, శ్రీనికా మహతి సాంప్రదాయ–ఆధునిక గీతాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమానికి యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ట్రస్ట్ బోర్డు సభ్యులు అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట, అశోక్ మడిశెట్టి, రవి మోచెర్ల, శ్రీదేవి అలెద్దుల, వెంకట్ నీల, సత్య పెడిరెడ్డి, మాజీ ఛైర్‌పర్సన్లు శ్రీధర్ మెడిచెట్టి, శ్రీధర్ సోమిశెట్టి, శ్రీధర్ వనం, భారతి కందుకూరి, సత్యేంద్ర పగడాల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, రవి వాస, లక్ష్మణ్ కోట, రాయ్ బొప్పన, శ్రీహరి అరిగె, పవన్ తిరునగరి, సునీత అరిగె, మాధవి తొటకూరు, ఉమ అనంతుల, బిందు పుట్లూరు, మురళి కోటలు సహకరించారు. సింగళూరి వంశీమోహన్ సంపాదేఎక్యంలో TAL వార్షిక పత్రిక 'మా తెలుగు 2026'ను ఆవిష్కరించారు. త్వరలో ప్రారంభం కానున్న క్రికెట్ సీజన్ T20 TAL ప్రీమియర్ లీగ్ (TPL)ను కూడా ప్రకటించారు.










