తెలుగుదనంతో తడిసి పరవశించిన టాంపా - నాట్స్ సంబరం ప్రారంభం

Featured Image

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా బేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల వద్ద ప్రవాసాంధ్రుల సందడి ఒకవైపు, సాయంకాలం జోరువాన ఓవైపు వెరసి టాంపా తెలుగుదనంలో తడిసి పరవిశించింది.

వేదిక ప్రధాన ద్వారం వద్ద వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలబడ్డాడు. నర్తనశాల పేరిట దిగువ భాగాన్ని, రంగస్థలం పేరిట పైభాగాన్ని ఈ వేడుకల నిర్వహణ కోసం నామకరణం చేశారు. బ్యాంక్వెట్ విందు రంగస్థల వేదికపై నిర్వహించారు.

సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేశారు. భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ప్రారంభమైన నాట్స్ నేడు అమెరికాలో తెలుగు సంఘాల సేవా కార్యక్రమాల్లోనే గాక మహాసభల నిర్వహణలోనూ రికార్డు నెలకొల్పిందని తనకు ఈ వేడుకల విజయవంతానికి తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ టాంపా అనే ఊరుపేరు అంటే నది, అమెరికా సంస్కృతి అని కాకుండా ఇకపై నాట్స్ సంబరాలు జరిగిన నగరంగా గుర్తుంచుకుంటారని అన్నారు. అతిథులకు స్వాగతం పలికారు.

ఫ్లోరిడా రాష్ట్ర సెనేటర్ జయ్ కాలిన్స్, అట్లాంటా కాన్సుల్ జనరల్ రమేష్ లక్ష్మణన్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన జులై 4వ తేదీన ప్రవాస భారతీయ సంఘమైన నాట్స్ సంబరాల్లో పాల్గొనడం అమెరికాలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. డా. దేవయ్య, రుద్రమ్మ పగిడిపాటి దంపతులకు విశేష సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు. రచయితలు కళ్యాణ్ చక్రవర్తిని అధ్యక్షుడు మందాడి శ్రీహరి, రామజోగయ్య శాస్త్రిని మాజీ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌లు సత్కరించారు. పలువురు బుల్లితెర నటీనటుల హాస్యవల్లరి అలరించింది.

సినీనటుడు దగ్గుబాటి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తారలు జయసుధ, రజిత, సుధీర్‌బాబు, దర్శకులు గోపీచంద్ మలినేని, మెహెర్ రమేష్, థమన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ అతిథుల వద్దకు వెళ్లి వారితో ఫోటోలు దిగి ఉత్సాహంగా సభా ప్రాంగణమంతా సందడి చేశారు.

ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, నాదెండ్ల మనోహర్‌లతో పాటు మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, కావలి గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు. సినీనటి మీనా, జయసుధ, నటుడు సాయికుమార్ కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. బ్యాంక్వెట్‌కు చంద్రబోస్ ఆధ్వర్యంలో నాటు బ్యాండ్ సంగీత విభావరితో ముగింపు పలికారు.

Tags-NATS 2025 8th america telugu sambaralu started with banquet in tampa florida

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles