కాలిఫోర్నియాలో ఆర్య వైద్య విశ్వవిద్యాలయానికి శంఖుస్థాపన

Featured Image

ఉత్తర కాలిఫోర్నియాలోని సాన్ వాకిన్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఆర్య వైద్య విశ్వవిద్యాలయ (AUSOM) భవన నిర్మాణనికి మంగళవారం నాడు శంఖుస్థాపన చేశారు. భారత కౌన్సిల్ జనరల్ డాక్టర్ శ్రీకర్‌రెడ్డి పాల్గొని అమెరికన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రవాస భారతీయులు మరీ ముఖ్యంగా ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

ఈ యూనివర్శిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు ఉందని తెలిపారు. కాలిఫోర్నియాలో తీవ్రమైన వైద్య నిపుణుల కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు తమ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందనే ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఉత్తర కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ తర్వాత లాభాపేక్ష లేని రెండో వైద్య కళాశాలగా ఇది భాసిల్లుతుందన్నారు. ఒక దశాబ్దానికి పైగా ప్రయత్నం, వేలాది గంటల శ్రమ, మిలియన్ల డాలర్ల ఖర్చు తర్వాత నేటి కార్యక్రమానికి చేరుకున్నామని ఆనంద్ తెలిపారు. 1923లో నిర్మించిన పురాతన భవనాన్ని ఆర్య విశ్వవిద్యాలయం కొరకు పునరుద్ధరించనున్నట్లు యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రభాకర్ కల్వచర్ల పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు సాన్ వాకిన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చింది. సాన్ వాకిన్ కౌంటీ 30 సంవత్సరాలకు గాను సంవత్సరానికి కేవలం ఒక డాలరు ఫీజుతో భవనాన్ని లీజుకు ఇస్తోంది. ఆర్య యూనివర్సిటీ CEO రాజు చమర్తి, కౌంటీ బోర్డ్ ఛైర్ పాల్ కనెపా, SJGH CEO రిక్ కాస్ట్రో, CMO డాక్టర్ షీలా కాప్రే, డాక్టర్ బాబ్ సస్కిండ్, డాక్టర్ ఆల్ఫ్రెడ్ టెనోర్, టెరి వర్క్‌మన్‌, డా. హనిమిరెడ్డి, డా. రఘురెడ్డి, స్టాక్టన్ మేయర్ క్రిస్టినా, దేవేందర్ నరాల, ఎల్వా స్పార్ట్లింగ్, వెంకట్ గుడివాడ, మమత కూచిభొట్ల, ప్రియ తనుగుల, మీనాక్షి గణేశన్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. హెల్త్ ప్లాన్ సాన్ వాకిన్ నుండి ₹17కోట్ల గ్రాంట్, డా. హెన్రీ వాంగ్ నుండి ₹8.5కోట్లు విరాళంగా అందజేశారు.

ఈ వైద్య కళాశాలను వచ్చే రెండేళ్లలో ప్రారంభించాలని లక్ష్యంగా నిర్మాణ పనులను ప్రారంభించారు. కాంగ్రెస్‌మెన్ జోష్ హార్డర్, స్టేట్ సెనేటర్ జెర్రీ మెక్నెర్నీ, అసెంబ్లీ వుమెన్ రొడెషియా రాన్సమ్ కార్యాలయాల నుండి వైద్య కళాశాకు గుర్తింపు పత్రాలు అందజేశారు.

Tags-ARIA School of Medicine AUSOM Ground Breaking Ceremony

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles