TNI ప్రత్యేకం..EB-5 ప్రాజెక్టులతో తస్మాత్ జాగ్రత్త!

Featured Image

• గ్రీన్ కార్డు కోసం EB-5 ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడుతున్న ప్రవాసాంధ్రులు

• అతి చౌకైన మూలధనం కోసం గాలం వేస్తున్న బడాబాబులు

• ₹7కోట్ల పెట్టుబడికి మూడేళ్ల రాబడి..₹21లక్షలు

• సులభమైన వర్క్ పర్మిట్ల కోసం ఆకర్షితులవుతున్న యువత

• సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత

• తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ధనవంతుల కుటుంబాలకు స్వర్గధామంగా EB-5

అమెరికాలో శాశ్వత నివాసం ఒక కల. ఆ దేశానికి విద్యాభ్యాసానికి, ఉద్యోగాలకు వచ్చి వలసదారులుగా ఉండి..దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డు లైనులో ఎదురుచూపులు చూడటం కంటే సంపాదించిన దాన్ని అమెరికాలో మంచి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి EB-5 ప్రోగ్రాం ద్వారా గ్రీన్ కార్డును త్వరగా పొందాలనుకుంటున్న వారి ఆశలను ఆసరాగా తీసుకుని ఇటీవలి కాలంలో EB-5 ప్రోగ్రామ్‌ను సైతం ప్రవాసాంధ్రులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న కేసులు బయటకు వస్తున్నాయి. అమెరికాలోని ప్రధాన నగరాల్లో తెలుగువారి ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి కాగితం మీద మాత్రమే నిజాయితీగా కనబడే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి సాటి తెలుగువారు ఇరుకున పడుతున్నారు. కష్టపడిన సొమ్మును అతిచౌకగా రియల్ ఎస్టేట్ బడాబాబులకు సమర్పించేస్తున్నారు. EB-5 ప్రోగ్రాం దరఖాస్తుదారులు వేలల్లో ఉంటే దానిలో పెట్టుబడి పెట్టి గ్రీన్ కార్డు వచ్చినవారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత అద్దం పడుతుంది. ప్రతి చిన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును EB-5గా చిత్రీకరిస్తూ ప్రవాసాంధ్రుల సొమ్ముల కోసం గాలమేస్తున్న కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఏమిటీ EB-5?

అమెరికా కాంగ్రెస్ 1990లో ప్రవేశపెట్టిన EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభించబడింది. అమెరికాలో ఉంటూ సరైన వీసా కలిగి ఉండి ఈ ప్రోగ్రామ్ కింద పెట్టుబడి పెట్టే అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారు, వారి కుటుంబ సభ్యులకు పెట్టుబడి పెట్టిన రెండు నెలల్లో వర్క్ పెర్మిట్ ఇస్తారు. అనంతరం USCIS ప్రచురించే వీసా డేట్లు పెట్టుబడిదారుని దరఖాస్తు తేదీతో సరిపోలినప్పుడు దరఖాస్తును పూర్తి స్థాయిలో సమీక్షించి రెండేళ్ల పాటు షరతులతో కూడిన గ్రీన్‌కార్డును USCIS అందిస్తుంది. ఆ తర్వాత, పెట్టుబడి నిజాయితీగా ఉపయోగించబడిందని, అవసరమైన ఉద్యోగ సృష్టి పూర్తయిందని నిరూపించగలిగితే, వారు శాశ్వత గ్రీన్‌కార్డు పొందగలరు. 2000 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు లక్షా ముప్పై ఐదు వేలకుపైగా విదేశీయులు EB-5 ద్వారా అమెరికాలో శాశ్వత నివాస హక్కు పొందారని నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ ఇటీవలి కాలంలో అత్యధికంగా దరఖాస్తుదారులు వచ్చినా, వాస్తవంగా గ్రీన్ కార్డు పొందేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. పెట్టుబడి పెట్టే సొమ్ము అమెరికాకు ఆర్థికంగా మేలు చేస్తే, పెట్టుబడిదారులకు గ్రీన్‌కార్డు పొందడాన్ని సులభతరం చేస్తుంది. EB-5లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుడు ఒక్కరికే కాకుండా అతడి జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు. EB-5 పెట్టుబడికి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. సాధారణ పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడికి కనీసంగా ₹9కోట్లు ($10.05లక్షలు) అవసరమైతే అధిక నిరుద్యోగిత ఉన్న పట్టణాలు(TEA), గ్రామీణ ప్రాంతాలు మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కనీసం ₹7కోట్లు ($8లక్షలు) పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడికి ప్రధాన నిబంధన..ప్రతి EB-5 ప్రాజెక్ట్ ద్వారా కనీసం పది మంది అమెరికా చట్టబద్ధ నివాసితులకు/ప్రవాసులకు/వలసదారులకు, అమెరికన్ పౌరులకు పూర్తిస్థాయి ఉద్యోగాలు, జీవిత బీమా కనీసం రెండు సంవత్సరాల పాటు కల్పించాలి. ఈ నిబంధన వల్ల పెట్టుబడితో అమెరికా ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకురుతుంది.

* రాబడి...వర్క్ పర్మిట్ ప్రయోజనాలు

అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ USCIS గుర్తించిన రీజినల్ సెంటర్ల ద్వారానే దాదాపు 95% EB-5 ప్రాజెక్ట్ దరఖాస్తులు వస్తాయి. ఈ రీజినల్ సెంటర్ల ద్వారా లైసెన్స్ పొందిన వారు ప్రాజెక్ట్ యజమానులుగా ముందుకు వచ్చి, USCIS నుంచి లభించిన ప్రాజెక్ట్ రసీదు చూపి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారు. పెట్టుబడిదారులు ఈ రసీదు ఆధారంగా ప్రాజెక్ట్ నిజమైనదని నమ్మి తమ నిధులను పెట్టుబడిగా పెడతారు. ఈ రీజినల్ సెంటర్ల పద్ధతిలో పెట్టిన పెట్టుబడిలో ఒక్క డాలరు కూడా USCIS వద్దకు గానీ అమెరికా ప్రభుత్వానికి కానీ వెళ్లదు. కేవలం ప్రాజెక్టు ఓనర్లు ప్రారంభించిన వారి ఖాతాల్లోకి వెళ్తుంది. ఈ ఖాతాలోని నిధులనే ప్రాజెక్టు పూర్తికి వెచ్చిస్తారు.

ఒక ప్రవాసుడు తన సొంత భూమి 15 ఎకరాల్లో ₹87కోట్లు($1 కోటి) విలువైన షాపింగ్ మాల్ నిర్మాణ ప్రణాళికను ప్రతిపాదిస్తాడు. తన ప్రాజెక్ట్ ఖాతాలో ₹21కోట్లు($25లక్షలు) ఉన్నట్టు చూపించి, మిగిలిన మొత్తానికి 10 EB-5 గ్రీన్‌కార్డు ఇన్వెస్టర్ పిటిషన్ల ద్వారా సమీకరిస్తానని USCIS రీజినల్ సెంటర్‌కి నివేదిక సమర్పిస్తాడు. రశీదు పొందిన అనంతరం ప్రాజెక్ట్‌ను ప్రచారం చేస్తూ EB-5 పెట్టుబడిదారులను ఆహ్వానిస్తాడు. ఒక్కో EB-5 పెట్టుబడిదారు తన శక్తి మేర ₹7కోట్లు ($8లక్షలు) ప్రాజెక్ట్‌లో పెడతాడు. ఈ పెట్టుబడికి మూడేళ్ల పాటు కేవలం 0.25% నుండి 1% మాత్రమే ప్రాజెక్టు ఓనర్లు సదరు పెట్టుబడిదారునికి చెల్లిస్తారు. అంటే ₹7కోట్ల పెట్టుబడికి మూడేళ్లకు గరిష్ఠంగా వచ్చేది ₹21లక్షలు అన్నమాట! కానీ ప్రాజెక్ట్ ఓనర్లు కాగితం మీద చూపెట్టిన ₹21కోట్ల పెట్టుబడికి రిటర్న్ గిఫ్ట్‌గా...అతి చౌకగా 10 మంది EB-5 ఆశావహుల నుండి వచ్చిన కష్టార్జితం విలువ అధికారికంగా ₹70కోట్లు. ప్రాజెక్టు పరిధి పెరిగే కొద్దీ దాని మొత్తం వ్యయం EB-5 పెట్టుబడిదారుల జేబులో నుండే వెళ్తుంది కూడా!

పైన పేర్కొన్నట్టు ప్రాజెక్టులో పెట్టుబడిదారుల సంఖ్య 10 మంది వద్దనే ఆగిపోతే అది నిజమైన, నమ్మకమైన ప్రాజెక్టుగా పరిగణించవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ఈ పరిస్థితి కనపడట్లేదు. ₹7కోట్లు($8లక్షలు) సామర్థ్యం లేని వారు తమ వద్దనున్న కొద్ది మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చునని ప్రాజెక్ట్ ఓనర్లు భరోసా ఇస్తారు. మిగిలిన మొత్తం తాము సర్దుబాటు చేస్తామని హామీలు ఇస్తారు. USCISతో ఇబ్బంది తల్లెత్తకుండా ఓనర్లు తాము ఇచ్చే సొమ్మును 10-15% లోనుకు ఇస్తున్నట్లు నకిలీ దస్తావేజులు రూపొందిస్తున్నారు. దీని ద్వారా ప్రాజెక్ట్ ఓనర్లకు చౌక మూలధనం లభించడం ఒకవైపు అయితే, పెట్టుబడిదారునికి 60 రోజుల్లో వర్క్ పర్మిట్‌ లభించడం మరో వైపు.

అమెరికాలో వర్క్ పర్మిట్ ఉంటే ఏ ఉద్యోగమైనా చేసుకునేందుకు వీలు ఉండటం వలన ఆర్థికంగా బలహీనమైన పెట్టుబడిదారులు ఇటువైపు కూడా మొగ్గుచూపుతున్నారు. అందుకే ఎంతో కొంత సొమ్ము EB-5 ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టి వర్క్ పర్మిట్ తెచ్చుకోవడానికి వెనుకాడట్లేదు. ఇలా వర్క్ పర్మిట్ తెచ్చుకున్న వారు తమ పేరిట సొంత కంపెనీలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇటీవలే న్యూజెర్సీకి చెందిన లాయర్ల ద్వారా ఒక విద్యార్థి ఈ తరహాలో లక్ష డాలర్లను EB-5లో పెట్టి వర్క్ పర్మిట్ పొంది అమెరికాకు రక్షణ పరికరాలను సరఫరా చేసే ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం పొందినట్లు సమాచారం. ఇలాంటి వారికి అమెరికాలో దీర్ఘకాలం నివసించాలనే ఆలోచన ఉండదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనేలా ఉన్నన్ని రోజులు డబ్బులు జేసుకుని వెళ్లిపోవడమే వీరి ప్రధాన ఉద్దేశం.

పెట్టుబడిదారుడు అమెరికాలో ఉంటేనే ఈ వర్క్ పర్మిట్ ఇస్తారు. పెట్టుబడిదారులు అమెరికా బయట ఉండి కూడా ఈ EB-5 ప్రోగ్రామ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారుడు అమెరికా వెలుపల ఉంటే EB-5 దరఖాస్తును USCIS సమీక్షించి, నిధుల మూలాలను నిర్ధారించుకున్నాక పెట్టుబడిదారుని దేశంలోని అమెరికన్ కాన్సులేట్ ద్వారా ఇమ్మిగ్రెంట్ వీసా జారీ చేస్తారు. దాని ఆధారంగా అమెరికాలోకి ప్రవేశించిన అనంతరం పెట్టుబడిదారులకు షరతులతో కూడిన గ్రీన్ కార్డు ఇస్తారు. ప్రాజెక్టు పూర్తయ్యాక షరతులు లేని శాశ్వత గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు.

* పెద్ద ప్లానే

USCISకు సమర్పించే దరఖాస్తులో ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం నాలుగేళ్లలో పూర్తి కావాలి. యజమాని నిజంగానే ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే, USCIS ఉద్యోగ సృష్టి మరియు పెట్టుబడి నిబంధనలు పూర్తయ్యాయని ధృవీకరిస్తుంది. దీంతో పెట్టుబడిదారులు తమ ప్రధాన గ్రీన్‌కార్డులను పొందుతారు. ఇది నిజాయితీగా ప్రాజెక్టులు చేసేవారికి లభించే ప్రయోజనం. కానీ అత్యాశపరులైన ప్రాజెక్ట్ ఓనర్లు USCISకు పంపిన దరఖాస్తులో పేర్కొన్నట్లు కాకుండా ఎక్కువ మందిని పెట్టుబడిదారులుగా చేర్చుకుంటున్నారు. తద్వారా అతి చౌకగా అత్యధికంగా మూలధనం లభించడం మినహా పెట్టుబడిదారులకు ఆశించిన ప్రయోజనం లభించట్లేదు.

అధికారికంగా ప్రాజెక్టులో ఎంతమందిని పేర్కొంటే వారి వరకే..అది కూడా ₹7కోట్లు చెల్లించినవారికి మాత్రమే గ్రీన్ కార్డు దరఖాస్తులను ప్రాజెక్ట్ ఓనర్లు USCISకు సిఫార్సు చేస్తున్నారు. చిన్నా చితకా సొమ్ములు పెట్టినవారు వర్క్ పర్మిట్ వద్దనే ఆగిపోతున్నారు. ప్రాజెక్టు పూర్తి అయ్యాక కనీస మొత్తం ₹7కోట్లు చెల్లించినవారు గ్రీన్ కార్డు పొందుతుంటే...ప్రాజెక్ట్ ఓనర్ల అత్యాశకు తక్కువ సొమ్ము కట్టిన వారి వర్క్ పర్మిట్ రద్దు కాబడి...డబ్బులు పోగొట్టుకుని...తిరిగి పాత వీసాలోకి వెళ్లిపోతున్నారు. మళ్లీ మరో EB-5 ప్రాజెక్టు వెదుక్కుని, అందులో పెట్టుబడి పెట్టి, వర్క్ పర్మిట్ తెచ్చుకోవడమనే సుడిలో పడిపోతున్నారు. దీనివలన పెట్టుబడిదారులకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుంది.

ఇక్కడ మరొక సమస్య ఏమిటంటే, ఒక పెట్టుబడిదారుడికి అదే ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన మరొకరి గురించి ఎలాంటి సమాచారం తెలియదు. EB-5 ప్రక్రియకు ప్రత్యేకమైన న్యాయవాదులు ఉంటారు. ప్రాజెక్ట్ యజమానులతో చేతులు కలిపి వీరు పోషించే పాత్ర కూడా ప్రధానం. అసలు EB-5 ప్రాజెక్టులకు రూపకల్పన చేసేదే అతి చౌకగా మూలధనం సేకరించడానికేనని డల్లాస్‌కు చెందిన ఒక టెకీ తెలిపాడు. అలా వచ్చిన పెద్దమొత్తాలను ప్రాజెక్ట్ యజమానులు ఇతర రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు ఇండియాలో పెట్టుబడులు, తెలుగు రాష్ట్రాల్లో తమ రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకునేందుకు కూడా వాడుతున్నారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు నిజమైన, నమ్మకమైన EB-5 ప్రాజెక్ట్ గురించిన సమగ్ర సమాచారాన్ని స్వతంత్ర సంస్థల సహకారంతో విశ్లేషించుకోవాలని, ప్రాజెక్ట్ ఓనర్ల గత చరిత్ర, వారు పూర్తి చేసిన ప్రాజెక్టులు వంటి వాటిని ఋజువు చేసుకుని రంగంలోకి దిగాలని EB-5 నిపుణులు సూచిస్తున్నారు.

* విజేతలు కాదు బాధితులు

అమెరికాలో దీర్ఘకాలంగా స్థిరపడి తమ వ్యాపారాల ద్వారా సంపాదించిన నిధులతో కొత్త EB-5 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ప్రవాసాంధ్రులు టెన్నిస్సీ, అరిజోనా, నార్త్ కరోలినా, టెక్సాస్, జార్జియా వంటి రాష్ట్రాల్లో తెరలేపుతున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి అటు ప్రాజెక్ట్ రూపకర్తలు, ఇటు పెట్టుబడిదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. కోవిద్ సమయం నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ EB-5 హవా గురించి చెప్పాలంటే..ప్రభుత్వానికి అధికారికంగా తమ గురించి తమ ప్రాజెక్టు గురించి చెప్పి, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా అతిచౌకగా మూలధనం సమీకరించడమే! అన్ని ప్రాజెక్టులు ఈ కోవలోకి రాకపోయినప్పటికీ, మెజార్టీ పెట్టుబడిదారులు విజేతలుగా కన్నా బాధితులుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడిదారులను ముంచేసినా, మరొకరిని తమ ప్రాజెక్టులకు ముఖచిత్రంగా పెట్టుకుని వెనుక నుండి కొందరు బడా ప్రాజెక్టు ఓనర్లు ఈ దందా నడిపిస్తున్నారు.

EB-1,2,3 కేటగిరీల్లో 10-20 ఏళ్లకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు EB-5లో డబ్బులు పెడితే వర్క్ పర్మిట్ వచ్చి టెన్షన్ లేకుండా కావల్సిన పని చేసుకోగలగడం ఈ పథకానికి అతిపెద్ద బలం. అందుకే కూరగాయల మార్కెట్ మూడో శాఖ విస్తరించాలన్నా కూడా EB-5 ద్వారా నిధుల సేకరిస్తున్నారంటే డిమాండ్‌ని, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద తలకాయలు, రాజకీయ నాయకులు గత రెండేళ్లుగా తమకు, తమ సంతానానికి EB-5 ద్వారా ఇమ్మిగ్రెంట్ వీసా తెచ్చుకుని, అమెరికాలో దిగే సమయానికి షరతులతో కూడిన గ్రీన్ కార్డును రాజమార్గంలో అందుకుంటున్నారు.

* కాదేదీ EB-5 ప్రాజెక్టుకు అనర్హం

ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా వచ్చిన EB-5 ప్రోగ్రామ్ క్రింద ఉద్యోగాలు కల్పిస్తే ఎలాంటి ప్రాజెక్టునైనా చేయవచ్చుననే నిబంధన ఉంది. దీన్ని ఆధారం చేసుకుని కూరగాయల మార్కెట్లు, సిమెంట్ ఇటుకల బట్టీలు, హోటళ్లు, కాఫీ షాపులు, అపార్ట్‌మెంట్లు, రిసార్టులు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ వంటి వాటితో పాటు ఆఖరికి కాసినోలను కూడా EB-5 ప్రాజెక్టులుగా ప్రారంభిస్తున్నారు. అందినంత మేర పెట్టుబడులు లాగేస్తున్నారు. గతంలో కేవలం ఒక ఇల్లు కొనడాన్ని కూడా EB-5 పెట్టుబడిగా USCIS ఆమోదించి గ్రీన్ కార్డులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా EB-5 పథకం ఒక పెద్ద మోసమని అన్నారంటే దాని విస్తృతిని అర్థం చేసుకోవచ్చు.

---సుందరసుందరి(sundarasundari@aol.com)

Tags-Experts Warn Of EB5 Scams In The US And How To Avoid Them

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles