డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారం

Featured Image

ఈ నెల 16వ తేదీ నుంచి రెండ్రోజుల పాటు టెక్సాస్‌లోని హోస్టన్‌, ఇండియా హౌస్‌లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహించనున్నట్టు పద్మభూషణ్‌, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ (వైఎల్పీ) వెల్లడిరచారు. ఈ మేరకు బుధవారం ఏయూలోని హిందీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాల్ని ఆయన వెల్లడిరచారు. రెండ్రోజుల పాటు అక్కడ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకు సదస్సు జరుగుతుందని, ఈ సదస్సును వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, హోస్టన్‌ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. సదస్సుకు భారత్‌ నుంచి ముఖ్య అతిథులుగా తనతో పాటు బుర్రా సాయి మాధవ్‌, కాత్స్యాయిని పద్మ, వీఎన్‌ ఆదిత్య, ప్రొఫెసర్‌ మాడభూషి సంపత్‌ కుమార్‌, డాక్టర్‌ జి. వల్లీశ్వర్‌, జయంతి ప్రకాష్‌ శర్మ, ఎం.రాధిక, ప్రొఫెసర్‌ ఈమిని శివ నాగిరెడ్డితో సహా పలువురు ప్రముఖ సాహితీవేత్తలు హాజరవుతున్నట్టు తెలిపారు. వీరితో పాటు అమెరికాకు చెందిన సాహితీవేత్తలు కూడా పాల్గొనున్నారన్నారు.

డల్లాస్‌లో ఉంటున్న ‘ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం’ వారి రెండు దశాబ్దాల ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య విభాగపు వ్యవస్థాపకులు, ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ వ్యవస్థాపక నిర్వాహకులు, ‘ఇండియన్‌ అమెరికన్‌ ఫ్రెండ్షిప్‌ కౌన్సిల్‌’ జాతీయ సంస్థ అధ్యక్షులు, ‘మహాత్మా గాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌’ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌, తానా పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌కు ఈ సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు సత్కారం, ఆర్య విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖ పురోభివృధికి శాశ్వత నిధి ప్రారంభ వేదిక, అమెరికా డయాస్పోరా తెలుగు కథ షష్టిపూర్తి వేదిక, సాహితీవేత్తల ప్రసంగాలు, స్వీయ కవితా పఠనం వేదిక, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలతో పాటు మరెన్నో పలు ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయని ఆచార్య యార్లగడ్డ వివరించారు. సదస్సులో భాగంగా ప్రముఖ రచయితల గ్రంథాల్ని ఆవిష్కరించనున్నట్టు వైఎల్పీ స్పష్టం చేశారు.

Tags-Houston Vanguri Foundation 14th Telugu Literary Meet-Thotakura Lifetime Achievement

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles