వైద్యరంగంలో..పద్మభూషణ్ విజేత డా.నోరి ప్రత్యేకత ఇదే!

Featured Image

క్యాన్సర్‌ అంటే మరణశాసనం కాదు..జయించదగిన జబ్బు అని ప్రపంచానికి చాటిన ప్రముఖ వైద్యుడు డా. నోరి దత్తాత్రెయుడు. భారతదేశ మాజీ ప్రధానుల నుంచి అమెరికా అధ్యక్షుల వరకు ఆత్మీయ వైద్యుడిగా పేరుగాంచారు. ఆయన సేవల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

కృష్ణా జిల్లా మంటాడలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో దత్తాత్రేయుడు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మచిలీపట్నంలో సాగింది. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, హైదరాబాద్‌ ఉస్మానియాలో ఎండీ చేశారు. ఆ సమయంలోనే క్యాన్సర్‌ను అంతం చేయాలనే గట్టి సంకల్పాన్ని గుండెల్లో నింపుకొన్నారు. కేవలం 8 డాలర్లతో అమెరికా గడ్డపై అడుగుపెట్టారు.

వైద్య ప్రపంచంలో డాక్టర్‌ నోరి పేరు వినగానే గుర్తొచ్చేది బ్రాకీ థెరపీ. అప్పట్లో క్యాన్సర్‌ చికిత్స అంటే శరీరమంతా రేడియేషన్‌ ఇచ్చే వారు. కానీ, డాక్టర్‌ నోరీ క్యాన్సర్‌ ఉన్న కణతి దగ్గరే రేడియో థార్మిక పదార్థాలను ఉంచి చికిత్స చేసే వినూత్న పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో ఆయన తీసుకొచ్చిన మార్పులు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ బ్రాకీ థెరపీ విధానానికి ఆయన్నే ఆద్యుడిగా పిలుస్తారు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని గౌరవాలు పొందినా తన సొంతగడ్డపై ప్రేమను మరిచిపోలేదు. హైదరాబాద్‌లోని ఇండో - అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి స్థాపనలో ఆయన కృషి వెలకట్టలేనిది.

అమరావతిలో ప్రపంచస్థాయి క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణానికి నోరి దత్తాత్రేయుడు అంకురార్పణ చేశారు. మారుమూల గ్రామాల్లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహిస్తూ పేదవారికి అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంచడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్‌ చికిత్సలో వస్తున్న మార్పులపై డాక్టర్‌ నోరి మరింత చురుగ్గా పనిచేస్తున్నారు. ఏఐ సాయంతో క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించే సాంకేతికతను భారత్‌కు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తూ.. ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

డా. నోరి 2015లో పద్మశ్రీ అందుకున్నారు. 2026లో ఆయన్ను పద్మభూషణ్ వరించింది. ఆయనకు ప్రవాసులు అభినందనలు తెలిపారు.

Tags-Achievements of Padmabhushan Dr Nori Dattatreyudu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles